నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ, పక్కన ఎస్‌ఐ
అద్దంకి: నకిలీ డాక్యుమెంట్స్, సీల్స్, ఐడీ కార్డులు ఉపయోగించి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఎనిమిది మంది నిందితులను అద్దంకి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితులకు సబంధించిన వివరాలను స్థానిక తన కార్యాలయంలో సీఐ హైమారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. వెల్లంపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన వద్ద రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడని ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన వీరాంజనేయరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మారెళ్లకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా తీగ లాగితే డొంక కదిలింది.
ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ముఠాలో ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం బూచి పాపన్నపాలేనికి చెందిన చింతా చిన్న ఓబయ్య, విజయవాడ బాలాజీ నగర్‌కు చెందిన ముప్పాళ్ల రేఖ, జి.ప్రవీణ్, గన్నవరం మండలం బుద్ధవరం గ్రామానికి చెందిన నక్కా చిన్న వెంకటేశ్వరరావు, పాత గుంటూరులోని రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన మాలావత్ హనుమంత్‌నాయక్, అనీల్‌కుమార్, రామిరెడ్డి, కొత్తపట్నం ఇందిరమ్మ కాలనీకి చెందిన వి.అంకయ్య, గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన షేక్ హుస్సేన్, సంతమాగులూరు మండలం ఎనిగపాడుకు చెందిన తలారీ మాధవ, గుంటూరులోని పండరీపురానికి చెందిన ముప్పాళ్ల భవ్య, అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ చెందిన వర్మ(రవి) అనే 13 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో వెల్లంపల్లి శ్రీనివాసులు, చింతా చిన్న ఓబయ్య, ముప్పాళ్ల రేఖ, నక్కా చిన్న వెంకటేశ్వరరావు, వి.అంకయ్య, షేక్ హుస్సేన్, తలారి మాధవ, ముప్పాళ్ల భవ్య అనే ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ విశ్వాసం వ్యక్తం చేశారు. నిందితులను కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment