మా నాన్నను హత్య చేసింది ఎవరో తేల్చాలి! | YS Viveka daughter Sunita Reddy Fires On Chandrababu about her father Murder case | Sakshi
Sakshi News home page

మా నాన్నను హత్య చేసింది ఎవరో తేల్చాలి!

Published Thu, Mar 28 2019 3:20 AM | Last Updated on Thu, Mar 28 2019 11:08 AM

YS Viveka daughter Sunita Reddy Fires On Chandrababu about her father Murder case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘నా తండ్రి మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు కారకులైన వారి పేర్లు బయటపెట్టాలి. మంత్రి ఆదినారాయణరెడ్డి గుట్టును రట్టుచేయాలి. దర్యాప్తునకు అవసరమైన చాలా సమాచారం ‘సిట్‌’కు ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. అయినా, ‘సిట్‌’అధికారులు ఏం చేస్తున్నారో అర్ధంకావటంలేదు’.. అని ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి కన్నీటిపర్యంతం అయ్యారు. హైదరాబాద్‌ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. 

హత్యలో పరమేశ్వర్‌రెడ్డి పాత్ర.. 
తన తండ్రి హత్యలో పరమేశ్వర్‌రెడ్డి పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. కసునూరు పరమేశ్వర్‌రెడ్డికి చాతినొప్పి అని మార్చి 14వ తేదీ తెల్లవారు జామున 4.30 గంటలకు ఆస్పత్రిలో చేరాడని.. అన్ని పరీక్షలు సాధారణం అని వచ్చాయన్నారు. వైద్యుల సలహా మేరకు సా.5.30కి ఆయన డిశ్చార్జి అయ్యాడన్నారు. హరిత హోటల్‌లో టీడీపీ కార్యకర్తలను కలుసుకుని తిరిగి అదే రాత్రి 8.30కి ఆస్పత్రిలో చేరాడన్నారు. మార్చి 15 తెల్లవారుజామున 4.30 గంటలకు సందర్శకుడు ఒకరు ఫోన్‌ తెచ్చి దానిలో ఏవో ఫొటోలను పరమేశ్వర్‌రెడ్డికి చూపినట్లు సునీతారెడ్డి వెల్లడించారు . హరిత హోటల్‌లో వారు హత్యకి ప్రణాళిక రచించా రా? ఆ సమయంలో 4.30కి అక్కడకు ఎవరు వచ్చారు.. వచ్చిన సందర్శకుడు ఫోనులో ఏం చూపా డని ఆమె ప్రశ్నించారు. అలాగే, బీటెక్‌ రవి ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో తన నేరచరిత్ర రికార్డును తానే ఒప్పు కోవటం అందరికీ తెలిసిందేనని సునీతా వివరించారు. రక్తపు మరకల్ని గంగిరెడ్డి ఎందుకు క్లీన్‌ చేయమన్నాడో కూడా విచారించి ఆ వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

దర్యాప్తు తీరులో అనేక అనుమానాలు.. 
కాగా, కేసు దర్యాప్తు జరిగే తీరులో అనేక అనుమా నాలు ఉన్నాయని డాక్టర్‌ సునీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ‘నాన్న చనిపోయి ఇన్ని రోజులైనా వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదో అంతు చిక్క డం లేదన్నారు. మా బంధువులను అదుపులోకి తీసు కుని పది రోజులైంది. మాకున్న అనుమానాలపై అధికారులకు వివరాలిచ్చినా ఆ దిశగా విచారణ చేయడంలేదని ఆమె వాపోయారు. మనిషి పోయింది మాకే.. పైగా మా మీదే నింద పడిందని గద్గద స్వరంతో అన్నారు. నాన్న చనిపోయాడని నేను, చిన్నాన్న చనిపోయాడని జగన్‌ అన్న బాధలో ఉంటే సానుభూతి వదిలేసి నిందలు వేయడం న్యాయమా? అని ఆమె ప్రశ్నించారు. నిజంగా నాన్న హత్య కేసులో మా కుటుంబంలోని వ్యక్తికే సంబంధం ఉంటే.. చంద్రబాబునాయుడు ఇన్ని రోజులు బయటపెట్టకుండా ఆగేవారా?’అని సునీతా అన్నారు. 

మంత్రి ఆదిని విచారించరెందుకు? 
ఇదిలాఉంటే.. మంత్రి ఆదినారాయణరెడ్డి గురించి మాట్లాడుతూ.. ‘జమ్మలమడుగు నియోజకవర్గంలో నాన్నకు మంచి పేరు ఉంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికే ఎక్కువగా ఎంపీ నిధులు ఖర్చు చేశారు. మా నాన్న ప్రచారంతో ఆదినారాయణరెడ్డి భయపడ్డారు. ఎన్నికల్లో ఆయనకు మా నాన్న అడ్డంకిగా కనిపించారు. మా నాన్నను అడ్డు తొలగిస్తేనే ఎన్నికల్లో గెలుస్తానని భావించారు. ఈ విషయాన్ని ‘సిట్‌’అధికారుల దృష్టికి తాను ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారు ఆయన్ను మాత్రం విచారించలేదు. పరమేశ్వర్‌రెడ్డి, బీటెక్‌ రవి, గంగిరెడ్డి తరచూ మాట్లాడుకునే వారని మీడియాలో వచ్చింది. ఆ విషయాల గురించి పోలీసులు విచారించరు. మా కుటుంబ సభ్యులను మాత్రం పదేపదే విచారిస్తున్నారు’.. అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.  

మా నాన్న లక్ష్యాలివే.. 
‘వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఎంపీగా గెలిపించటం.. జగనన్నను సీఎంని చేయడమే నాన్న ముఖ్య లక్ష్యం. అందుకే అహోరాత్రులు కష్టపడుతున్నారు. అందులో భాగంగానే జమ్మలమడుగుకు వెళ్లి అల్లె ప్రభావతమ్మ మద్దతును కూడగట్టాడు. అంతే.. అదే రాత్రి కిరాతకంగా చంపేశారు. ‘సిట్‌’విచారణపై మాకు నమ్మకంపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు సమగ్రంగా విచారణ చేయలేరు. పోలీస్‌ అధికారులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశాం. వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీని బదిలీ అని వార్త విన్నాం. అంటే ఎన్నికల కమిషన్‌ మా ఫిర్యాదు విశ్వసించినట్లు ఉంది. కాబట్టి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. అందుకు మీ సహాయ సహకారాలు అవసరం. అందుకే ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటుచేశా. ప్లీజ్‌ హెల్ప్‌ మీ’.. అంటూ మీడియాను ఉద్దేశిస్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.  
మా కుటుంబ నాశనానికి బాబు కుట్ర 

తమ కుటుంబాన్ని సర్వనాశం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని డాక్టర్‌ సునీతారెడ్డి ఆరోపించారు. జగనన్నకు నాన్నకు మధ్య మంచి అనుబంధముందని.. వారిమధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. ప్రజల్లో ఓ రకమైన భయం సృష్టించాలనే చంద్రబాబు ఓ పథకం ప్రకారం మాట్లాడుతున్నాడని ఆమె విమర్శిం చారు. విచారణ సవ్యంగా జరిగితే అన్ని బయటకు వస్తాయన్నారు. కాగా, వివేకా హత్య అనంతరం వెలుగుచూసిన లేఖలోని చేతి రాత తన తండ్రిదేనని.. కానీ, అందులోని భావం, పదాలు మాత్రం నాన్నవి కాదని సునీతా చెప్పారు. బలవంతంగా రాయించారా? దీనిని ఎవరు రాయించారు అనేది తేలాల్సి ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement