బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డితో పద్మనాభం అన్న కుమారుడు శ్రావణ్‌కుమార్ (ఫైల్)
పాత కక్షలు పురివిప్పాయి.. వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.. హత్యా రాజకీయాలు ఓ కుటుంబాన్ని వీధిన పడేశాయి. ఎన్నికల్లో ఓటమిని ఓర్వలేని టీడీపీ, బీజేపీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయి. నిండు ప్రాణాలను సైతం హరించేందుకు తెగబడుతున్నాయి. ప్రశాంతమైన పల్లెల్లో అరాచకం సృష్టించేందుకు దిగజారుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. పక్కా ప్రణాళికతో ప్రత్యర్థుల ఉసురు తీసేస్తున్నాయి. – సాక్షి, తిరుపతి
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీ, బీజేపీ స్థానిక నేతలు ఏకమై రెచ్చిపోతున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో పగ, ప్రతీకారాలను పెంచి పోషిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అనుచరులను టార్గెట్ చేశారు. స్థానిక ఎన్నికల సమయంలో తొట్టంబేడు మండలం ఈదులగుంటకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బత్తెయ్యను హత్య చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి రూరల్ మండలానికి చెందిన బొజ్జల వర్గీయుడు రాంబాబు, ఆయన అనుచరులు పలుమార్లు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, వలంటీర్లపై దాడులు చేశారు.
ఆస్పత్రి వద్ద రోదిస్తున్న వెంకటేష్ కుటుంబ సభ్యులు, మృతుడు సాలాపక్షి వెంకటేష్ (ఫైల్)
స్థానిక ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రెవెన్యూ కార్యాలయం వద్ద బైఠాయించి నానా యాగీ చేశారు. బస్సు అద్దాలను పగలగొట్టి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. బొజ్జల సుధీర్‌రెడ్డి ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కొనసాగుతుండడంతో టీడీపీ, బీజేపీ శ్రేణులు దాడులనే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. తాజాగా శ్రీకాళహస్తి రూరల్ మండలం ఉడమల పంచాయతీ దొమ్మరపాళానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటేష్‌ను అతి కిరాతంగా చంపేశారు. ఇందులో టీడీపీ, బీజేపీ కార్యకర్తల ప్రమే యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. చదవండి: ‘నిమ్మగడ్డ’ నియామకంపై మరో పిటిషన్
3నెలల క్రితమే ప్లాన్..?
సాలాపక్షి వెంకటేష్ వైఎస్సార్‌సీపీలో చురుకైన కార్యకర్త. చుట్టుపక్కల ఎస్సీ కాలనీల్లో మంచి గుర్తింపు ఉంది. వెంకటేష్ ఎదుగుదలను స్థానిక టీడీపీ నేత సాలాపక్షి పద్మనాభం ఓర్వలేకపోయాడు. పలు మార్లు తన అనుచరులైన శ్రావణ్‌కుమార్, సుకుమార్, అంకయ్య, రమేష్, హరితో కలసి వెంకటేష్‌తో ఘర్షణకు దిగాడు. మూడు నెలల క్రితం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిన సమయంలో ఓ పోలీస్ అధికారి జోక్యం చేసుకున్నాడు. టీడీపీ, బీజేపీ నేతలతో కుమ్మక్కై వెంకటేష్ను బెదిరించాడు.
ఊరు వదలి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. లేకుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరించాడు. దీంతో వెంకటేష్ గ్రామం విడిచివెళ్లిపోయాడు. భార్య, పిల్లలను చూసుకునేందుకు అప్పుడప్పుడు ఊరి పొలిమేరకు వచ్చి వారిని పిలిపించుకుని మాట్లాడి వెళ్లేవాడు. ఈ క్రమంలో వెంకటేష్ కదలికలపై పద్మనాభం, అతడి అనుచరులు నిఘా పెట్టారు. సోమవారం ఉదయం వెంకటేష్ వస్తున్నట్లు తెలుసుకుని దారి కాచారు. ఊరి పొలిమేరలో అడ్డుకుని కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఈ హత్య వెనుక ఓ పోలీస్ అధికారి పాత్ర సైతం ఉన్నట్లు మృతుడి బంధువులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. చదవండి: యువతి కోసం గ్యాంగ్ వార్
Comments
Please login to add a commentAdd a comment