మూగరోదనపై మౌనమేల..? | ysrcp woman leaders Visitation tribal and dumb girl | Sakshi
Sakshi News home page

మృగాడిని శిక్షించాల్సిందే

Published Thu, Jan 4 2018 11:28 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

ysrcp woman leaders Visitation tribal and dumb girl  - Sakshi

గిరిజన మూగ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాలు, వైఎస్సార్‌ సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు గాజువాకలో ధర్నా నిర్వహించి, బాధితురాలికి బాసటగా నిలిచారు. మరోవైపు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే జరిగిన దురాగతాన్ని గోప్యంగా ఉంచేందుకు యత్నించిన యాజమాన్యాన్ని మాత్రం కావాలనే పోలీసులు తప్పించారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

అగనంపూడి(గాజువాక): బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన మృగాడిని శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. దళిత హక్కుల పోరాట సమితి, ఏపీ మహిళా çసమాఖ్య ప్రతినిధులు కూర్మన్న పాలెం జంక్షన్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు.   ఈ కేసు నీరు గార్చేందుకు   పోలీసులు యత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ అధికారితోపాటు బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అసలు మైనర్‌ను విధుల్లో ఎలా చేర్చుకున్నారనే దానిపై మాత్రం దృష్టి సారించనేలేదు. సంఘటన జరిగిన సందర్భంలో కేసు రాజీ చేసేందుకు యాజమాన్య ప్రతినిధులే రాయబేరాలు కుదర్చినా వారిని ఎందుకు వదిలేసినట్టు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.  కేవలం ఇద్దరినే అదుపులోకి తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హెచ్‌బీఎల్‌ ప్రతినిధులు కంపెనీ పరువు పోతుందని భావించి వారే సెక్యూరిటీ అధికారితో వెలగట్టి డబ్బులు సమకూర్చారని భోగట్టా. కాని వారి జోలికి వెళ్లకుండా కేవలం మైనర్‌తో పనులు చేయించుకోవడం (బాల కార్మికులతో పనులు చేయించుకోవడం)పై చిన్నపాటి కేసుతో సరిపెట్టారని ప్రచారం జరుగుతోంది. మైనర్‌ను పనిలోకి పెట్టుకోవడం ఒక తప్పయితే... మైనర్‌కు పాస్‌ మంజూరు కోసం ఆమె ఏ పత్రాలు సమర్పించింది అనే విషయాలు కూడా పరిగణలోకి తీసుకోలేదు. రాయబేరాలు మొత్తం హెచ్‌బీఎల్‌ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో జరిగా యని తోటి కార్మికులే చెబుతున్నారు. అలాంటప్పుడు కంపెనీ ప్రతినిధుల జోలికి ఎందుకు వెళ్లలేదు? కేసును పోలీసులు పక్కదారి పట్టించి నీ టరు గార్చడానికే ఇలా చేస్తున్నారనే అరోపణలు వెల్లువెతుతున్నాయి.

సెజ్‌లోని కంపెనీల్లో మైనర్లు!
 దువ్వాడ సెజ్‌లోని కంపెనీల్లో కనీస వేతనాలు అమలు చేయడం లేదని, కాంట్రాక్టు కార్మికులకు అయితే రూ.3వేల కూడా చెల్లించే పరిస్థితి లేదని చెబతున్నారు. మైనర్లకు తక్కువ డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని భావించి వారిని ఈ పనులకు వినియోగిస్తున్నారని తెలిసింది. ఇటువంటి వాటిపై కార్మిక శాఖ అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అఘాయిత్యం కేసులో ముగ్గురి అరెస్ట్‌
అగనంపూడి (గాజువాక): గిరిజన బధిర బాలికపై జరిగిన అత్యాచారం కేసును నీరు గార్చేం దుకు ప్రయత్నించారనే ఆరోపణలు రావడంతో దువ్వాడ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దువ్వాడ పోలీస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సౌత్‌ ఏసీపీ రామోహనరావు వెల్లడించిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన సీహచ్‌.విశ్వనాథం దువ్వాడ సెజ్‌లోని హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌లో బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 30న ఒంటరిగా తోట పనులు చేసుకుంటున్న గిరిజన,బధిర బాలికను సమీపంలోని బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారం చేశాడు. ఆమెను వివస్త్రను చేసి కోరిక తీర్చుకున్నాడు. అనంతరం బాధితురాలు ఏడుస్తూ పరుగు తీయడంతో ఆమెతోపాటు పనిచేస్తున్న మహిళలు విషయం తెలుసుకుని సెక్యూరిటీ సిబ్బందికి వివరించారు. అయితే విషయం బయటకు పొక్కితే కంపెనీతోపాటు సెజ్‌కు చెడ్డ పేరు వస్తుందని సెజ్‌ ఏఎస్‌వో ప్రకాశరావు, బస్సు యజమాని ఎం.అప్పలరాజు బాధితురాలికి లక్ష రూపాయలు చెల్లించారు.

సంఘటన రోజు బాధితురాలు ధరించిన దుస్తులను తీసుకొని కాల్చేశారు. అయితే  విషయం బయటకు పొక్కడంతో దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన విశ్వనాథం, కేసు మాఫీ చేయడానికి వెలగట్టిన సెజ్‌ ఏఎస్‌వో ప్రకాశ్‌రావు, బస్సు యజమాని ఎం.అప్పలరాజులను అరెస్టు చేసి న్యాయం స్థానంలో బుధవారం హాజరుపర్చారు. విశ్వనాథంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మానభంగం, నిర్భయ కేసులు, కంపెనీ యాజమాన్యంపై బాల కార్మికులతో పనిచేయించుకుంటున్న కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు. అలాగే సంఘటనకు సంబంధించి బాధితురాలి శీలానికి వెలగట్టిన లక్ష రూపాయలతోపాటు బస్సును సీజ్‌ చేశామని తెలిపారు. కేసును ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏసీపీ ప్రవీణ్‌కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో గాజువాక సీఐ ఇమ్యానుయేల్‌ రాజు పాల్గొన్నారు.  

రూ.20లక్షల పరిహారమివ్వాలి- వైఎస్సార్‌ సీపీ మహిళా నాయకుల డిమాండ్‌
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకులు డిమాండ్‌ చేశారు. కేజీ హెచ్‌లో చికిత్స పొందుతున్న  మైనరు బాలికను బుధవారం పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ నాయకులు మాట్లాడుతూ నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, నిందితుడికి సహకరించిన సెక్యూరిటీ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌బీఎల్‌ కంపెనీ యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘించి  బాలికను ఎలా పనిలో పెట్టుకుందని ప్రశ్నించారు. మైనర్లచేత పని చేయించకూడదని తెలిసీ పని చేయిస్తున్న యాజమాన్యంపై కార్మిక శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికకు ప్రభుత్వం రూ.20లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని, అమ్మాయితో పాటు ఆమె కుటుంబానికి ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల విశాఖ రైల్వే న్యూ కాలనీలో పట్టపగలు మతిస్థిమితం లేని మహిళపై తాగిన మైకంలో ఒక యువకుడు  అత్యాచారం చేసిన సంఘటన మరువక ముందే మరొక సంఘటన జరగడం విచారకరమన్నారు. పటిష్టమైన పోలీసు వ్యవస్థ లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర అనుబంధ విభాగం నాయకులు పీలా వెంకట ధనలక్ష్మి, యువశ్రీ, శ్రీదేవి, మధులత, వెంటలక్ష్మి తదితరులు మైనర్‌ బాలికను పరామర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement