ఇదీ.. భారతీయత అంటే!
షికాగో పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది వివేకానందుడు. భారతీయ సంస్కృతి గొప్ప తనాన్ని షికాగో వేదికగా చాటిచెప్పిన మహనీ యుడు ఆయన. మళ్లీ ఆ తర్వాత అదే వేదికపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పిన వ్యక్తిగా ఓ భారతీయ విద్యార్థి పేరు గడించాడు. ఆ విద్యార్థి తాను చేసిన ఒక పని వల్ల ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన గౌరవ్ జవేరి అనే భారతీయ విద్యార్థి స్నాతకోత్సవంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వేదిక మీదకు వెళ్లిన గౌరవ్ పట్టా అందుకున్న వెంటనే యూనివర్సటీ డీన్ కాళ్లకు నమస్కారం చేసి కిందికి వెళ్లిపోయాడు.
భారతీయ సంప్రదాయం తెలియని డీన్ ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయారు. కాసేపటి తర్వాత తేరుకున్న డీన్ విద్యార్థి తన కాళ్లకు నమస్కరించినట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ షేర్ అవు తోంది. ట్వీటర్‌లో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న వీడియోల్లో ఒకటిగా నిలచింది. భారతీయులు ఎక్కడున్నా భారతీయులేనని, గురువుకు నిజమైన గౌరవం దక్కిందంటూ కొందరు, ఇదీ భారతీయత అంటే.. అంటూ మరికొందరు ట్వీటర్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.