అమెరికా-కెనడాలో 2017-18 విద్యాసంవత్సరానికిగానూ సిలికానాంధ్ర మనబడి తరగతులు సెప్టెంబర్9 నుండి ప్రారంభమయ్యాయి.
అమెరికా-కెనడాలో 2017-18 విద్యాసంవత్సరానికిగానూ సిలికానాంధ్ర మనబడి తరగతులు సెప్టెంబర్9 నుండి ప్రారంభమయ్యాయి. సిలికానాంధ్ర మనబడి ద్వారా గత 10 సంవత్సరాల్లో 27000 మందికి పైగా ప్రవాస బాలలు తెలుగు నేర్చుకున్నారు. అమెరికాలో 35 పైగా రాష్ట్రాల్లో 250 కేంద్రాలలో ఈ విద్యాసంవత్సరం తరగతులకు వేలాది మంది విద్యార్ధులు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు అమెరికా వ్యాప్తంగా ప్రతిష్టాత్మక డబ్ల్యూఏఎస్‌సీ(వెస్టర్న్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్) గుర్తింపు లభించిన మనబడి తరగతులకు 27కు పైగా స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్కు అర్హత సాధించిన తెలుగు నేర్పించే ఏకైక విద్యాలయం సిలికానాంధ్ర మనబడి.
కాలిఫోర్నియా సన్నివేల్ విభాగంలో తరగతులను ప్రారంభిస్తూ మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, భారత దేశానికి ఎంతో దూరంగా ఉన్నా, మాతృ భాషకి దూరం కాకూడదని, పుట్టిన ఊరిలో ఉన్న వారితో బంధాన్ని నిలిపి ఉంచేందుకు మన భాష ఎంతో ముఖ్యమని గుర్తించి మన పిల్లలకు తెలుగు నేర్పించాలన్న లక్ష్యంతో మనబడి ప్రారంభించామన్నారు. దశాబ్ది కాలంగా తమ పిల్లలను మనబడిలో చేర్పించి తెలుగు నేర్పిస్తున్న తల్లి తండ్రులకు, భాషాసేవయే భావితరాల సేవ ! అనే స్ఫూర్తితో తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, భాషా సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాలలో తరగతులను మనబడి ఉపాద్యక్షులు శరత్ వేట, డాంజి తోటపల్లి, భాస్కర్ రాయవరం, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి తదితరులు పర్యవేక్షించారు.
అమెరికా వ్యాప్తంగా ఈ వారాంతంలో వివిధ ప్రాంతాలలో తరగతులు ప్రారంభమైన సందర్భలో, కూపర్టినో కేంద్రంలో మనబడి తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చెసిన ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగెశ్వరరావు మాట్లాడుతూ, తెలుగు భాషకు ప్రపంచపీఠంపై పట్టంకట్టడానికి మనబడి చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు. తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మాతృభాష పట్ల మమకారాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనబడి 2017-18 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు సెప్టెంబర్ 22, 2017 వరకు అందుబాటులో ఉంటుందని, రిజస్టర్ చేసుకోవడానికి, మరిన్ని వివరాలకు manabadi.siliconandhra.org చూడాలని మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల కోరారు.