డల్లాస్లో సినారె సంతాప సభ
డల్లాస్ :
ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డికి డల్లాస్లోని తెలుగువారు ఘన నివాళులు అర్పించారు. టాంటెక్స్, ఆటా, తానా, నాటా, డాటా, టాటా, నాట్స్, కళా వాహిని,టీ, టీడీఎఫ్ సంఘాల సహకారంతో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్(టీపీఏడీ) ఆధ్వర్యంలో బసెర ఇండియన్ రెస్టారెంట్లో సినారె సంతాప సభ జరిగింది. పెద్ద మొత్తంలో తెలుగు ప్రజలు ఒక్కచోట చేరి డా.సి. నారాయణరెడ్డి మృతిపై తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
సి. నారాయణరెడ్డి మరణ వార్త తెలియగానే టీపీఏడీ సభ్యులు శారదా సింగిరెడ్డి, రావు కల్వల, రఘువీర్ బండారు, మాధవి సుంకిరెడ్డి, అశోక్ కొండల, కరణ్ పోరెడ్డి, ఉపెందర్ తెలుగులు సంతాప సభను ఏర్పాటు చేశారు. డా. సాంబ శివ రావు, డా. ఆల్ల శ్రీనివాస్ రెడ్డి, తోటకూర ప్రసాద్, రావు కల్వల, రఘువీర్ బండారు, శారదా సింగిరెడ్డిలు సి. నారాయణరెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా శారదా సింగిరెడ్డి మాట్లాడుతూ..
తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు వెలిగిన మేరు పర్వతం మేను వాల్చింది.
ప్రపంచ మహోన్నత కవులకు తీసి పోనంతగా విశ్వంభర తో విశ్వ నరుడిగా వెలుగొందిన వాడు.
కవిలోకానా సూర్యుని వలె కవితా కాంతులుగా వెలుగొందిన వాడు.
యింతటి మహా కవిని తెలుగుతల్లి , తెలుగునేల కనడానికి ఎన్నేళ్లు పడుతుందో కదా!
అంటూ సినారె లేనిలోటు తీర్చలేనిదిగా అభివర్ణించారు.