ఇరిగేషన్‌లో 108 అదనపు పోస్టులు
♦ భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా
♦ కొత్తగా 8 సీఈ, 7 ఎస్‌ఈ, 21 ఈఈ,
♦ 55 డీఈఈ పోస్టులు
♦ పాలమూరు ప్రాజెక్టుకు 26, కాళేశ్వరానికి 30, డిండికి 16, పెన్‌గంగకు 14 పోస్టులు
♦ కొత్తగా డీఏఓ, సీఏఓ పోస్టుల మంజూరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం 108 అదనపు పోస్టులకు పచ్చజెండా ఊపింది. కృష్ణా, గోదావరి నదులపై పాలమూరు-రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం, పెన్‌గంగ వంటి కొత్త ప్రాజెక్టులను నిర్మించడంతోపాటు ఎస్సారెస్పీలాంటి పాత ప్రాజెక్టులను కూడా బలోపేతం చేస్తున్నందున అందుకు అవసరమైన అధికారులను నియమించుకోవాలని భావించింది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా ఏఈలు, ఏఈఈల నియామక ప్రక్రియ సాగుతున్నందున సీనియర్ అధికారులందరికీ పదోన్నతులు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం, కొత్తగా 108 ఉన్నతాధికారుల పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి జీతభత్యాల రూపేణా ఏటా రూ.9.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.
రాష్ట్రంలో ఇప్పటికే 33 భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు గత బడ్జెట్‌లో రూ.8 వేల కోట్లు కేటాయించారు. మరోపక్క రూ.2 వేల కోట్లతో 9 వేల చెరువుల పునరుద్ధరణ పనులు పుంజుకున్నాయి. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు ఉంటాయని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను 2017 నాటికి పూర్తి చేసేలా, కొత్త ప్రాజెక్టులను అప్పటిలోగా పాక్షికంగా పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం నీటిపారుదల శాఖలో కేవలం నలుగురు మాత్రమే పూర్తిస్థాయి చీఫ్ ఇంజనీర్ పోస్టుల్లో ఉండగా, మరో పది చోట్ల అదనపు బాధ్యతలు చూస్తున్నారు. చిన్న నీటిపారుదల శాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, హైడ్రాలజీ, నాగార్జునసాగర్, కరీంనగర్, మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ల పోస్టుల్లో ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్లంతా అదనపు బాధ్యతలు చూస్తున్నవారే. దీనికితోడు ప్రస్తుతం ఇంజనీర్ ఇన్ చీఫ్‌లుగా బాధ్యతలు చూస్తున్న ముగ్గురికి పదవీకాలం పొడిగించారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులను వెంటనే భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
22 మంది సీఈలు.. 46 మంది ఎస్‌ఈలు
తాజా నిర్ణయంతో ఇప్పటికే ఉన్న 14 మంది సీఈ (చీఫ్ ఇంజనీర్)లకు తోడుగా మరో 8 మందిని, ప్రస్తుతమున్న 39 మంది ఎస్‌ఈ (సూపరింటెండెంట్ ఇంజనీర్)లకు తోడుగా మరో ఏడుగురిని నియమించే అవకాశం లభించింది. ఇకపై మొత్తంగా సీఈలు 22, ఎస్‌ఈలు 46 మంది ఉండనున్నారు. ఇక వీటితోపాటే ప్రస్తుతమున్న 183 మంది ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)లకు తోడుగా మరో 21 మందిని, ఇప్పుడున్న 619 మంది డీఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)లకు తోడుగా మరో 55 మందిని, కొత్తగా 15 మంది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు (డీఏఓ), ఇద్దరు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ల (సీఏఓ) పోస్టులను శాఖాపరమైన పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఇందులో పాలమూరు రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం, పెన్‌గంగ, కాడా, విజిలెన్స్‌లతో పాటు మరో రెండు విభాగాలకు కొత్తగా చీఫ్ ఇంజనీర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో పాలమూరు ప్రాజెక్టుకు సీఈ, ఎస్‌లతో పాటు 5మంది ఈఈలను, 13 మంది డీఈఈలను, 6 మంది డీఏఓలను అంటే మొత్తంగా 26 పోస్టులను కేటాయించగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఈ, 2 ఎస్‌ఈ, 7 ఈఈ, 16 డీఈఈ, 4 డీఏఓ పోస్టులను అంటే మొత్తంగా 30 పోస్టులను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. డిండికి మొత్తంగా 16 పోస్టులు, పెన్‌గంగకు 14 పోస్టులను భర్తీ చేయనుంది.