
జ్ఞాపకాలు–2016
నిజామాబాద్ అర్బన్ : ఇందూరుకు 2016 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. జిల్లాల పునర్విభజన, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు వంటి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.టనాలుగేళ్ల తర్వాత విస్తారంగా వర్షాలు కురియడంతో జిల్లా తడిసి ముద్దయింది. ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలుగా మారాయి. ఆర్మూర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
►వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో ఆమె బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు.
►ఏప్రిల్ 29న మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ప్రశాంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
►మే 25న కామారెడ్డి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదం నింపింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
►మే 26న ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభకు ఎంపికయ్యారు.
►సీఎం కేసీఆర్ ఈ సంవత్సరం రెండు సార్లు జిల్లాలో పర్యటించారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో నిజామాబాద్, బాన్సువాడలలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు 28న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేమలు ప్రశాంత్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి మృతి చెందడంతో సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన చోటు చేసుకుంది.
►ఇందూరు జిల్లాకు సంబంధించి గతేడాదిలో చోటు చేసుకున్న పరిణామాల్లో కీలకమైనది జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ. 36 మండలాలతో దశాబ్దాలుగా కొనసాగిన నిజామాబాద్ జిల్లా రెండుగా విడిపోయింది. దసరా రోజున కామారెడ్డి జిల్లా పురుడు పోసుకుంది. అదే రోజు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటయ్యాయి.
►జిల్లాలో మరో కీలక పరిణామం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు. జిల్లాలోని అన్ని ఠాణాలను కలిపి కమిషనరేట్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి పోలీస్ కమిషనర్‌గా కార్తికేయ బాధ్యతలు స్వీకరించారు.
►నవంబర్ 8న ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రకటన ప్రభావంతో ఇందూరు ప్రజా బ్యాంకుల ముందు బారులు తీరింది. కొత్త నోట్లు రాక, నగదు చేతిలో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటీఎంలు తెరుచుకోలేదు. డబ్బు దొరకక ప్రజలు ఆందోళనకు దిగారు.
టనవంబర్ 12, 13 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరుగడంతో నిరుద్యోగుల్లో సంతోషం వెలిసింది.