దళిత సంక్షేమానికి ప్రణాళిక | 2017-18 Annual Credit Plan is finalized | Sakshi
Sakshi News home page

దళిత సంక్షేమానికి ప్రణాళిక

Published Wed, Jul 26 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

2017-18 Annual Credit Plan is finalized

2017–18 వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
► రూ.53.92 కోట్లతో 1,992 మందికి లబ్ధి 
► స్వయం ఉపాధికి బాటలు
► మూడెకరాల భూ పంపిణీకి ముందడుగు
►  మొదటి పంటకు ఆర్థిక సాయం అందజేత
► నిరుద్యోగులకు శిక్షణా తరగతులు
► వివరాలు వెల్లడించిన ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ యాదయ్య


దళితులను స్వయం ఉపాధి, సమృద్ధితో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.     గతేడాది మాదిరిగానే 2017–18 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.53.92 కోట్లతో 1,992 యూనిట్లు(లబ్ధిదారులు) మంజూరు చేసేందుకు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది.     కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆమోదంతో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పెరిక యాదయ్య ప్రణాళికను విడుదల చేస్తూ     విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతేడాది కార్పొరేషన్‌ ద్వారా 1,032 యూనిట్లకు గాను రూ.17.85 కోట్లను ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాదికంటే 960 యూనిట్లను పెంచగా సగానికి పైగా సబ్సిడీ రుణాల మంజూరును పెంచినట్లు స్పష్టమవుతోంది. – సాక్షి, కరీంనగర్‌


సాక్షి, కరీంనగర్‌: జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకుల స్వయం ఉపాధికి తోడ్పాటు కానుంది. భూ కొనుగోలు పథకం ద్వారా దళితకలకు మూడెకరాల భూ పంపిణీకి ముందడుగు పడనుంది. సాగు యోగ్యమయ్యేలా మొదటి పంటకు ఆర్థిక సాయమూ అందనుంది. నీటి వసతి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. స్వయం ఉపాధికి గాను అర్హులైన ఎస్సీలకు మొదటి కేటగిరీలో 80 శాతం సబ్సిడీ, రెండో కేటగిరీలో 70 శాతం సబ్సిడీ, మూడో కేటగిరీలో 5 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది.

1,992 యూనిట్లకు గాను లబ్ధిదారులకు రూ.47.02 కోట్లు సబ్సిడీ రూపంలో అందించనున్నారు. అందులో స్వయం ఉపాధికి అర్హులైన ఎస్సీలకు బ్యాంకు లింకేజీకి రూ.15.92 కోట్ల విలువైన 922 యూనిట్లు పంపిణీ చేయనున్నారు. ఇందులో రూ.11.12 కోట్లు ఎస్సీ కార్పొరేషన్‌ సబ్సిడీ రూపంలో ఇస్తుందని అధికారులు తెలిపారు. వాహన కొనుగోలుకు సంబంధించి 55 యూనిట్లకు గాను 2.99 కోట్ల విలువైన రుణాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

నిరుద్యోగులకు శిక్షణ
జిల్లా వ్యాప్తంగా ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది స్టడీ సర్కిళ్లతోపాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేగాకుండా జిల్లా ప్రాధాన్యతలుగా గుర్తించి ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, వికలాంగులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా 56 యూనిట్ల (లబ్ధిదారులు)లో ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున 50 శాతం సబ్సిడీతో రుణ సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.

భూపంపిణీకి ముందడుగు..
భూమి కొనుగోలు పథకం ద్వారా విభజిత కరీంనగర్‌ జిల్లాలో ఈ ఏడాది దళితులకు మూడెకరాల పంపిణీకి మోక్షం కలిగించేలా చర్యలకు ఉపక్రమించారు. 132 మందికి రూ.27.72 కోట్లు విలువ చేసే 396 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత కరీంనగర్‌ జిల్లాలో 236 ఎకరాలున్నట్లు గుర్తించగా 79 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

అందులో.. ఇప్పటికే 39 మందికి గాను 100 ఎకరాల ప్రైవేట్‌ భూమి కొనుగోలుతోపాటు సాగుయోగ్యం, నీటి వసతికి అనువుగా ఉందని గుర్తించారు. ఇంకా మిగిలినవి భూగర్భజల విభాగం, స్థానిక తహసీల్దార్ల నుంచి నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గతేడాది 411 మంది లబ్ధిదారులకు రూ.29.79 కోట్ల విలువైన 755 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఈ ఏడాది పంపిణీ చేసిన భూమికి మొదటి పంటకు ఆర్థిక సాయం ద్వారా రూ.57.82 లక్షలను మంజూరు చేయనున్నారు. అందులో రూ.1.79 కోట్ల రాయితీ ఉంటుందని అధికారులు తెలిపారు. నీటి వసతికిగాను బోర్‌వెల్స్, పంప్‌సెట్లు, ట్యూబ్‌వెల్, ఆయిల్‌ ఇంజన్లు, పైపులైన్ల రూపంలో 307 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు     అధికారులు పేర్కొన్నారు.

లబ్ధిపొందాలనుకుంటే దరఖాస్తు ఇలా..
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిపొందాలనుకునే ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విధానం ఏడాది పొడవునా ఉండడంతో ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ అవుతుంటుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది వరకు ఎంపీడీవోలు, ఆయా స్థాయిలోని అధికారుల వద్దనే 6,500 వరకు పెండింగ్‌ దరఖాస్తులుండడం గమనార్హం. గతం గతః అన్నట్లుగా తాజాగా ప్రభుత్వం ఎంపిక చేసే అర్హులైన లబ్ధిదారులు, విడుదల చేసే నిధులపైనే ఆధారపడి ఉంది. గతంలో పెండింగ్‌లో ఉన్న వాటికి వేరుగా నిధులు విడుదలవుతాయని అధికారులు తెలిపారు.

ప్రస్తుతానికి అభ్యర్థులు ఆధార్‌కార్డు, తెలంగాణ ప్రభుత్వంతో జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, ఇటీవల తీసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం వివరాలతో ఠీఠీఠీ.్టటౌbఝఝట.ఛిజజ.జౌఠి.జీn/లో నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు  ఎంపీడీవో పరిశీలన అనంతరం గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారుడు బ్యాంకు కాన్సెంట్‌ ఇస్తే జిల్లాస్థాయిలో పరిశీలన కలెక్టర్‌ ఆమోదంతో సబ్సిడీ మంజూరు కానుందని అధికారులు వివరించారు. అయితే అధికారికంగా ఈనెల 31 వరకు దరఖాస్తుకు గడువు ఉన్నా.. సాధ్యం కాని పక్షంలో మరింత పొడిగించే అవకాశముందని ఈడీ యాదయ్య తెలిపారు..

దళారులను నమ్మొద్దు..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలకు అత్యధిక సబ్సిడీతో స్వయం ఉపాధి, సమృద్ధి పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. 100 శాతం, 80, 70, 60 శాతం సబ్సిడీల రూపంలో దళితుల ఆర్థిక పరిపుష్టికి తోడ్పడుతోంది. ఎస్సీల అభివృద్ధికి ప్రోత్సాహాకాలిస్తోంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా యూనిట్లను లబ్ధి చేకూరుస్తాం. దళారులను ఆశ్రయించొద్దు. రుణాల కోసం ఎవరి మాయమాటలు నమ్మొద్దు..        – పెరిక యాదయ్య, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement