రావులపాలెంలోని ఓ ఏటీఎమ్ లో చోరికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడ(తూర్పుగోదావరి) : రావులపాలెంలోని ఓ ఏటీఎమ్ లో చోరికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏమంటే.. ఫిర్యాదుచేసిన వ్యక్తే చోరీకి పాల్పడటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి రావులపాలెంలోని ఓ ఏటీఎమ్ కేంద్రంలో చోరీకి పాల్పడ్డాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో చోరీ విషయంపై ఫిర్యాదు చేశాడు.
అయితే, ఫిర్యాదుదారుడిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. చోరీకి పాల్పడ్డట్లు ప్రదీప్ కుమార్ అంగీకరించాడు. ఇందులో ప్రమేయమున్న మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.31.73 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.