
పేకాడుతున్న ఏడుగురు మహిళల అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వివిధ జిల్లాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో 30 మందికి పైగా పేకాట ఆడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండడం విశేషం.
కర్నూలు: కర్నూలు జిల్లాలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓబుళాచారి రోడ్డులో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు. పాండురంగస్వామి గుడి సమీపంలో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.15,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం: ఏడుగురు మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం ఉదయం దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండడం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. పట్టుబడిన వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.