చేనేత విక్రయాలపై 30 శాతం రాయితీ ఇవ్వాలి
జనతా వస్త్రాల పథకం ప్రారంభించాలి
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలి
చేనేత సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు రాము
దానవాయిపేట (రాజమహేంద్రవరం) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల వస్త్ర విక్రయాలపై 30 శాతం రాయితీ మంజూరు చేసి చేనేత రంగాన్ని అదుకోవాలని చేనేత సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రాము డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని లాలాచెరువు ఆప్కో భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాము మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు జనతా వస్త్రాల పథకాన్ని ప్రారంభించి నేత కార్మికులకు హామీతో కూడిన ఉపాధి కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని చేనేతలకూ వర్తింపజేయాలని, వర్క్‌షెడ్లతో కూడిన గృహాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సహకార చట్టంలోని 116 (సీ) నిబంధన నుంచి చేనేత సహకార సంఘాలను మినహాయించాలని తీర్మానించారు. సమావేశంలో రాష్ట్ర చేనేత సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపక్షం, ఆప్కో డైరెక్టర్లు ముప్పన వీర్రాజు, దొంతంశెట్టి సత్యనారాయణ మూర్తి, డీసీసీబీ డైరెక్టర్ పి.లాలయ్య, మోరి చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు చింతా వీరభద్రేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.