జిల్లాలో 4 వేల ఉపాధ్యాయ ఖాళీల గుర్తింపు
Published Sat, Jun 17 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM
భానుగుడి (కాకినాడ) :
జిల్లాలో గత కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న రేషనలైజేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. 64 మండలాలలకు సంబంధించి 4 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు మండల విద్యాశాఖాధికారులతో నిర్వహించిన క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా గుర్తించినట్టు డీఈవో ఎస్.అబ్రహం శనివారం కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. రేషనలైజేషన్, బదిలీల విషయంలో కోర్టు వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. సంబంధిత జీవోలపై అధికారులతో చర్చించారు. జిల్లాలో 8 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులు 4,500 మంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం బదిలీలకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ బదిలీల ప్రక్రియ ఈనెలాఖరు నాటికి ముగిసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.
7 పాఠశాలల విలీనం
హేతుబద్ధీకరణలో భాగంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 7 పాఠశాలలను దగ్గర్లో ఉన్న పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అమలాపురం మండలం నుంచి –2, పిఠాపురం–1,రాజమండ్రి–1, ఏజెన్సీ మండలాల్లో–2, రౌతులపూడి–1 వంతున విలీనం చేయనున్నారు. కమిషనర్‌కు ఆయా పాఠశాలలకు సంబంధించి వివరాలను సమాచారం అందించి అనుమతి రాగానే వాటిని దగ్గర్లో ఉన్న పాఠశాలలకు విలీనం చేయనున్నట్టు సమాచారం.
Advertisement