రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు | 5 crores no intrest debt | Sakshi
Sakshi News home page

రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు

Published Sun, Oct 9 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు

రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు

మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ చినతాతయ్య
కాకినాడ : పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ పి.చినతాతయ్య చెప్పారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం డ్వాక్రా సంఘాల సభ్యులతో ఆయన ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేశారు. సంఘాల పనితీరు, ఆర్థికంగా బలోపేతం తదితర అంశాలపై సభ్యులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటికి రాష్ట్రంలోని 19 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులు ప్రస్తుతం సంపాదిస్తున్న ఆదాయాన్ని రెండింతలు చేయాలన్నదే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సుమారు రూ.8 వేల కోట్ల అదనపు ఆదాయం వారు పొందేలా ఈ ప్రణాళిక ఉంటుందన్నారు.  ఇందుకు నాలుగు అంశాలను అమలు చేస్తూ సంఘాల పురోభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. సభ్యులు వృత్తి నైపుణ్యం, ఆర్థికావసరాలను గుర్తింపుపై దృషి ్టపెట్టామని సూచించారు. డ్వాక్రా సభ్యులు విద్యా పరంగా కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి జిల్లాకు 50 మంది కమ్యూనిటీ వైద్యులుగా అభివృద్ధి చెందేలా శిక్షణ ఇస్తామన్నారు. వారందరినీ చంద్రన్న బీమా పథకంలో చేరుస్తున్నామన్నారు. కొంతమంది ఆర్‌పీలు అవినీతికి పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఏ మాత్రం ఉపేక్షించబోమన్నారు. కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకినాడ పోర్టు ప్రాంతంలోని 45 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, కమిషనర్‌ ఆలీమ్‌బాషా, కార్పొరేషన్‌ కార్యదర్శి రమేష్, మెప్మా పీడీ మల్లిబాబు, డిప్యూటీ కమిషనర్‌ సన్యాసిరావు, టీపీఆర్వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.  
రుణాలు ఎందుకు రద్దు కాలేదంటే..
ఎన్నికల వేళ ‘తాతయ్య’ చెప్పిన కథ
కాకినాడ : ‘డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కాలేదని మీకందరికీ కోపంగా ఉందా...? చేయకపోవడానికి  కారణాలు ఏమిటో మీకు తెలుసా? డ్వాక్రా మహిళలను మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ చినతాతయ్య ప్రశ్నించారు. డ్వాక్రా సభ్యుల సమావేశంలో రుణమాఫీ విషయంలో విసిగిపోయిన మహిళలను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కారణాలను ఆయన ఇలా చెప్పుకొచ్చారు.  సీఎం డ్వాక్రా రుణాల రద్దుపై వేసిన కమిటీ  సిఫార్సు మేరకు  రూ.8,200 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. ఈ రుణాన్ని మాఫీ చేస్తే సకాలంలో అప్పు తీర్చిన సభ్యులలో అసంతృప్తి చెందుతారని, సభ్యులందరికీ న్యాయం చేసేలా రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కార్ఫస్‌ ఫండ్‌గా బ్యాంకుల్లో వేశారు. కార్ఫస్‌ ఫండ్‌కు ఏడు రెట్లు అదనంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే కార్పస్‌ ఫండ్‌ తీసుకునే అవకాశం లేక, బ్యాంకు రుణాలు రాక డ్వాక్రా సభ్యులు సతమతమవుతున్నట్టు గుర్తిం చారు. మొదట విడత రూ.మూడు వేలతోపాటు రెండో విడత ఇచ్చే మరో రూ.3 వేలను సభ్యులే వినియోగించుకునేలా ఉత్తర్వులు రానున్నా యన్నారు. ఈ విషయంపై ఎవరేమి చెప్పినా  నమ్మవద్దని వారికి సలహా కూడా ఇచ్చారు. 
కార్పొరేషన్‌ ఎన్నికల కోసమా?
కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డ్వాక్రా మహిళలు చేజారిపోకుండా ఉండేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు పలువురు డ్వాక్రా మహిళలు భావించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement