నోట్ల రద్దు ..50 రోజులు
- తీరని కాసుల కష్టాలు
- 10 శాతం కూడా పనిచేయని ఏటీఎంలు
అనంతపురం అగ్రికల్చర్ :
పాత పెద్ద నోట్లు రద్దు చేసి బుధవారానికి సరిగ్గా 50 రోజులవుతుంది. ఇన్ని రోజులైనా ప్రజల కరెన్సీ కష్టాలు ఏ మాత్రమూ తీరడం లేదు. 50 రోజుల గడువివ్వండి.. నగదు కష్టాలు పూర్తిగా తగ్గిస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరిన సమయం కూడా నేటితో ముగియనుంది. కష్టాలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద రోజంతా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. 49వ రోజు మంగళవారం కూడా జిల్లా అంతటా అన్ని బ్యాంకులు, తెరిచిన ఏటీఎంల వద్ద పెద్దసంఖ్యలో ప్రజలు పడిగాపులు కాశారు. రెండు రోజుల కిందట జిల్లాకు రూ.160 కోట్ల వరకు నగదు సరఫరా అయ్యింది. జిల్లా వ్యాప్తంగా 440 బ్యాంకు శాఖల్లో లావాదేవీలు జరిగినట్లు బ్యాంకర్లు తెలిపారు. 10 నుంచి 12 శాఖల్లో నగదు లేక లావాదేవీలు జరగలేదు. ఎస్‌బీఐకు సంబంధించి చాలా శాఖల్లో ఒకేసారి రూ.24 వేల విత్‌డ్రా ఇస్తున్నట్లు రీజనల్ మేనేజర్ ఎంవీఆర్ మురళీకృష్ణ తెలిపారు. మిగతా బ్యాంకుల శాఖల్లో రూ.6 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేలు ఇస్తున్నారు. ఏటీఎంల పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. ప్రధాన బ్యాంకులకు చెందిన ఏటీఎంలు సైతం తెరచుకోలేదు. 556 ఏటీఎంలకు గానూ 50-60 మాత్రమే పనిచేసినట్లు సమాచారం. వాటిలో కూడా కేవలం రూ.2 వేల నోట్లు మాత్రమే వచ్చాయి. ఏటీఎంల ద్వారా రోజుకు రూ.2,500 తీసుకోవచ్చనే నిబంధన ఉన్నా రూ.100 నోట్ల కొరత ఎక్కువగా ఉండటంతో కేవలం రూ.2 వేల నోటుకే పరిమితం అవుతున్నారు. ఆర్బీఐ, కేంద్రం విధించిన పాత నోట్ల డిపాజిట్ల గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. అయినా డిపాజిట్లు పెద్దగా రావడం లేదని దాదాపు అన్ని బ్యాంకులకు చెందిన అధికారులు చెబుతున్నారు. పాత నోట్లు రద్దు చేసిన తర్వాత ఇప్పటివరకు జిల్లాకు రూ.1,500 కోట్ల వరకు కొత్త నగదు సరఫరా అయినట్లు బ్యాంకర్లు తెలిపారు. నగదు సరఫరా, డిపాజిట్లు, పంపిణీకి సంబంధించి కచ్చితమైన గణాంకాలు చెప్పడానికి లీడ్‌బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగిడుతుండటం, అలాగే జన్మభూమి కార్యక్రమాలు ఉన్నందున నగదు సమస్య ఏర్పడకుండా చాలా బ్యాంకుల్లో ప్రస్తుతం సర్దుబాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయానికి మరో రూ.150 కోట్ల వరకు జిల్లాకు సరఫరా అయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.