అనంతపురం సెంట్రల్ :
గత నెలలో ఇషాక్ అనే వ్యక్తి ఖాతాలో నుంచి డబ్బు మాయమైన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుని కథనం మేరకు.... అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి గ్రామానికి చెందిన పుల్లలరేవు మనోహర్‌రెడ్డి వ్యవసాయపనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈయనకు సప్తగిరి సర్కిల్‌కు సమీపంలోని కరూర్ వైశ్యాబ్యాంకులో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ (1434155000054587) ఉంది. గత నెల 28న నగరంలో కమలానగర్‌లోని రాజేంద్ర ఏజెన్సీలో, ఈ నెల 6న పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో స్వైప్‌మిషన్ ద్వారా దుస్తులు కొనుగోలు చేసినట్లు బాధితుడు తెలిపాడు. అంతకు మించి ఎప్పుడూ స్వైప్‌మిషన్ కానీ, ఏటీఎంకార్డులు కాని వినియోగించలేదన్నాడు. అయితే ఈ నెల 9న తన ప్రమేయం లేకుండా ఖాతా నుంచి రూ.10,200 రెండు విడుతలుగా డ్రా అయిపోయినట్లు బాధుతుడు వాపోయాడు.
కేసు నమోదుకు పోలీసులు వెనుకంజ
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికే వెనుకంజ వేస్తున్నారు. బాధితుడు మనోహర్‌రెడ్డి ఫిర్యాదు చేయడానికి తిరగని పోలీస్‌స్టేషన్ అంటూ లేదు. తొలుత సైబర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా తాము కేసు తీసుకోబోమని చెప్పారని బాధితుడు తెలిపాడు. అక్కడి నుంచి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కెళితే తమ పరిధి కాదన్నారని, టూటౌన్ పోలీస్‌స్టేషన్, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా కేసు నమోదు చేయలేదని చెప్పాడు. చివరకు ఎక్కడి నుంచి తన ఖాతాలో డబ్బు మాయం అయిందో చెప్పాలని కరూర్ వైశ్యా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.