
నిప్పుల కొలిమిలా కొత్తగూడెం..
ఖమ్మం జిల్లా కొత్తగూడెం అగ్నిగుండంగా మారింది. రహదారులు నిప్పుల కొలిమిని తలపించాయి. వడగాడ్పుల దెబ్బకు ప్రజలు విలవిల్లాడారు.
- 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- నిప్పుల కొలిమిలా రహదారులు
- నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం అగ్నిగుండంగా మారింది. రహదారులు నిప్పుల కొలిమిని తలపించాయి. వడగాడ్పుల దెబ్బకు ప్రజలు విలవిల్లాడారు. ఆదివారం 52 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రచండ భానుడి ధాటికి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైన భానుడి ప్రభావం.. క్రమక్రమంగా మధ్యాహ్నానికి ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇక ఇళ్లల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోత, వేడి గాలులతో అల్లాడిపోయారు. వారాంతపు సంత కూడా వెలవెలబోయింది. సాయంత్రం 7గంటల అనంతరమే ప్రజలు సంతకు వచ్చేందుకు ఆసక్తి కనబరిచారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతోపాటు సింగరేణి ఓపెన్‌కాస్టు గనికి అతి చేరువలో ఉన్న కారణంగా ఏటా కొత్తగూడెంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. మే నెలలో రోళ్లు పగిలిపోయేలా భానుడి ప్రభావం ఉంటుంది.
మరోవైపు రామగుండంలో అత్యధికంగా 46.2 డిగ్రీలు, భద్రాచలంలో 45.4, ఆదిలాబాద్‌లో 45.3, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
కొత్తగూడెం 52.0
రామగుండం 46.2
భద్రాచలం 45.4
ఆదిలాబాద్ 45.3
ఖమ్మం 44.4
నిజామాబాద్ 43.6
హన్మకొండ 43.5
నల్లగొండ 43.0
మెదక్ 42.4
హైదరాబాద్ 42.0
మహబూబ్‌నగర్ 39.2