రూ.9.64 లక్షల మినపప్పు స్వాధీనం
కాకినాడ సిటీ : అక్రమంగా నిల్వ ఉంచిన రూ.9.64 లక్షల విలువైన 120 క్వింటాళ్ల మినపప్పును పౌర సరఫరాల శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి కాకినాడ గొడారిగుంట సీతారామనగర్‌లోని ఒక ఇంటి నుంచి విశాఖపట్నం తరలించేందుకు లారీలో పప్పు లోడ్ చేస్తుండగా అసిస్టెంట్ పౌర సరఫరా శాఖాధికారి పి.సురేష్ నేతృత్వంలోని అధికారుల బృందం దాడి చేసింది. మహలక్ష్మి ట్రేడర్స్ పేరిట నారపురెడ్డి శ్యామల ఫుడ్ గ్రేన్ లైసెన్స్ (ఎఫ్‌జీఎల్) లేకుండా పప్పు దినుసుల వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. నిల్వ ఉంచిన సరుకును సీజ్ చేసి దిగుమర్తివారి వీధిలోని సాయికృష్ణ ట్రేడర్స్‌కు అప్పగించారు. సరుకు తరలిస్తున్న లారీని సీజ్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మహలక్ష్మి ట్రేడర్స్ అధినేత శ్యామలపై నిత్యావసర వస్తువుల చట్టం 6ఏ కేసు నమోదు చేశామని, తగిన చర్యలకు కలెక్టర్‌కు నివేదిక అందజేసినట్టు అసిస్టెంట్ పౌర సరఫరా శాఖాధికారి సురేష్ తెలిపారు. నూనె, పంచదార, పప్పు దినుసులు వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పౌర సరఫరాలశాఖ నుంచి ఫుడ్‌గ్రేన్ లైసెన్స్ తీసుకోవాలన్నారు. డిప్యూటి తహసీల్దార్లు ఎ.తాతారావు, ఎస్‌ఎం.బాషా, జీపీఏ పి.సుబ్బారావు పాల్గొన్నారు.