
నెల రోజుల ఉత్సవాలకు ‘అమ్మ’ ముస్తాబు
గిరిజనుల ఆరాధ్య దైవం.. మహిమాన్విత అమ్మలగన్న అమ్మ జంగుబాయి పుణ్యక్షేత్రం నెల రోజుల ఉత్సవాలకు ముస్తాబైంది.
► నేడు జంగుబాయి క్షేత్రంలో దర్బార్
►హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు, అధికారులు
► ఆరు వేలకుపైగా ఆదివాసీల రాక
► ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ సభ్యులు
కెరమెరి : గిరిజనుల ఆరాధ్య దైవం.. మహిమాన్విత అమ్మలగన్న అమ్మ జంగుబాయి పుణ్యక్షేత్రం నెల రోజుల ఉత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు వనక్షేత్రంలో దర్బార్ జరగనుంది. ఇందుకోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. గత రెండు రోజులుగా ఎనిమిది గోత్రాలకు చెందిన కటోడాలు అక్కడే బస చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మునుపెన్నడూ జరగని విధంగా దర్బార్ నిర్వహించేందుకు ఆదివాసీలు సిద్ధమయ్యారు. దీనిపై వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో విస్త్రత ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌లో అసెంబీ సమావేశాలకు వెళ్లిన మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్షి్మని కలిసి ఆహ్వానించారు. వారితో పాటు గిరిజన సంక్షేమ అధికారులకూ ఆహ్వానపత్రమిచ్చారు.
తెలంగాణ, మహారాష్ట్ర నుంచి..
తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలతోపాటు వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మహారాష్ట్రలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సుమారు ఆరు వేలకుపైగా ఆదివాసీలు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు కూడా రానున్నారు. ఎలాంటి రోడ్డు రవాణా సౌకర్యం లేకున్నా రాళ్లు రప్పలు, దుమ్ము, ధూళిలో సైతం కొందరు కాలిబాటన వస్తే మరికొందరు. ఎడ్లబండిపై జంగుబాయి సన్నిధికి చేరుకుంటున్నారు. సుమారు వెయ్యికిపైగా ఎడ్లబండ్లు రావచ్చని ఆలయ చైర్మన్ మరప బాజీరావు తెలిపారు. ఇందుకోసం పార్కింగ్ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం చేస్తున్నారు.
మంత్రి, కలెక్టర్ రాక..
మంత్రి జోగురామన్నతోపాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఎక్కా, టూరిజం డైరెక్టర్ సత్యనారాయణ, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్, మంచిర్యాల కలెక్టర్, ఐటీడీఏ ఇన్ చార్జి ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణన్ హాజరుకానున్నారు. కార్యక్రమంలో టూరిజం అధికారులు జంగుబాయి జీవిత చరిత్ర పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.