ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ
- రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన బుక్కరాయసముద్రం ఏఈ గోపాల్‌రెడ్డి
- రైతు నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలంలో విద్యుత్‌శాఖ ఏఈగా పనిచేస్తున్న గోపాల్‌రెడ్డి ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌రెడ్డి ధర్మవరం నుంచి బదిలీపై నాలుగేళ్ల క్రితం బుక్కరాయసముద్రం వచ్చాడు. మండల పరిధిలోని నీలారెడ్డిపల్లికి చెందిన సాయినాథ్‌రెడ్డి అనే రైతు తన పొలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం 2014లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం రూ.52 వేల డీడీ కూడా చెల్లించాడు. 2015 జూన్ 15న ఇతనికి ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసింది.
అప్పటి నుంచి దాన్ని పొలంలో ఏర్పాటు చేయాలని ఏఈని సాయినాథ్‌రెడ్డి వేడుకుంటున్నాడు. తనకు లంచం ఇవ్వాలని, లేకపోతే ట్రాన్స్‌ఫార్మర్ వేరొకరికి ఇస్తానని గోపాల్‌రెడ్డి బెదిరించాడు. ఆయనడిగిన రూ.7 వేల లంచం ఇవ్వలేక సాయినాథ్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకే ఏఈకి సోమవారం ఆయన కార్యాలయంలోనే లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ జయరాంరాజు, సీఐ ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఏఈ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి.. ఏఈని కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.