చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి
-
- రూ.22,170 నగదు స్వాధీనం
-
- వరుస దాడులు చేస్తున్నా మారని సిబ్బంది తీరు
పొందుగల (దాచేపల్లి) : మండలంలోని పొందుగల గ్రామ సమీపంలోని వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. చెక్‌పోస్ట్‌లో అనధికారికంగా ఉన్న రూ.22,170 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ చంద్రవంశ దేవనాంద్ శాంతో, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ - ఆంధ్ర మధ్య రాకపోకలు సాగిస్తున్న లారీల నుంచి చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు లంచాలు వసూలు చేస్తున్నారని ఏసీబీ దృష్టికి వచ్చింది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ దందా చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో దాడి చేసిన ఏసీబీ అధికారులు చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏసీటీవోలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లను ప్రశ్నించారు. కొన్ని గంటల పాటు చెక్‌పోస్ట్‌లో ఉండి లారీ డ్రైవర్ల నుంచి నగదును తీసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ చెక్‌పోస్ట్ వద్ద ఆగి ముద్ర వేయించుకున్నందుకు లారీ డ్రైవర్ల నుంచి రూ.100 చొప్పున లంచాలు వసూలు చేస్తున్నారని, దీనిపై విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అక్రమంగా లంచాలు తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు లంచాల కోసం డిమాండ్ చేస్తే 94913 05638 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు.
వరుస దాడులు చేస్తున్నా...
పొందుగల చెక్‌పోస్ట్‌లో అక్రమ వసూళ్లు తారస్థాయికి చేరటంతో ఏసీబీ దృష్టికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రత్యేక దృష్టిసారించిన ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. అయినా వసూళ్లు ఆగకపోవడం గమనార్హం. ఈ చెక్‌పోస్ట్ మీదుగా గ్రానైట్, సిమెంట్, ఇనుము, స్టీల్, మిర్చి, ఫర్నిచర్, శనగలతో పాటు పలు రకాల వస్తువులను లారీల ద్వారా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తుంటారు. రాష్ట్రం దాటి వచ్చేటప్పుడు తప్పనిసరిగా చెక్‌పోస్ట్‌లో ఆగి ముద్ర వేయించుకోవాలి. ఈ క్రమంలో లారీ డ్రైవర్ల నుంచి విధులు నిర్వహించే అధికారులు ముక్కుపిండి లంచాలు వసూలు చేస్తున్నారు.
గతంలో చేసిన దాడుల వివరాలివీ...
- 2015 నవంబర్ 27న దాడిచేసి అనధికారికంగా ఉన్న రూ.68 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం కేవలం రూ.7200 అని గుర్తించి విస్తుపోయారు.
- 2016 జనవరిలో చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహించే సీనియర్ అసిస్టెంట్ మందడపు మల్లిఖార్జునరావు, జూనియర్ అసిస్టెంట్ పగడాల శ్రీనివాసరావు గుంటూరులో ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
- 2016 మార్చి 15న చెక్‌పోస్ట్‌పై మరోసారి దాడిచేసి అక్రమంగా ఉంచిన రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.