మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు
– ప్రమాదాల నియంత్రణకు పరిజ్ఞానం పెంచుకోవాలి
– రోడ్డు భధ్రతా వారోత్సవాల్లో వక్తలు
అనంతపురం సిటీ : రోడ్డు ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాలతోనే అధికంగా జరుగుతున్నాయని వక్తలు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌లో ‘రహదారులు–భవనాలశాఖ’ ఆధ్వర్యంలో ‘రోడ్డు భధ్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుబ్రమణ్యం అధ్యక్షత వహించగా, ముఖ్య అథితులుగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జేఎన్‌టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ హేమచంద్ర, పలువురు ఇంజినీర్లు హాజరయ్యారు. ఈసందర్భంగా జేసీ లక్ష్మీకాంతం, జేఎన్‌టీయూ ఫ్రొఫెసర్ హేమచంద్ర తదితరులు మాట్లాడుతూ దేశం ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తోందన్నారు. ఇక్కడున్న రోడ్లు, ఫుట్‌పాత్‌లతోపాటు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ప్రయాణాలు సాగించాలన్నారు.
వేగం ఎంత ప్రమాదమో తెలుసుకోవాలన్నారు. వంద ప్రమాదాలు జరిగితే వాటిలో 98 ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయన్నారు. కేవలం మానవ తప్పిదాల కారణంగా చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ తప్పిదాలను నియంత్రించాలంటే ప్రత్యేక చట్టాలు, హెచ్చరికలు, సూచనలు ఎన్ని ఉన్నా...ప్రతి మనిషిలో ప్రమాదాల నియంత్రణ పట్ల పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే చాలన్నారు. గమ్యాన్ని చేరాలంటే వేగం ఒక్కటే సరిపోదన్నారు. అనంతరం రోడ్లు భవణాల శాఖలో ప్రమాదాల నియంత్రణపై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉద్యోగులకు అధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముందుగా ఆర్‌అండ్‌బీ కార్యాలయం నుంచి స్థానిక సఫ్తగిరి సర్కిల్ దాకా ఇంజనీరింగ్ విద్యార్థినీ, విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆ శాఖ అధికారులు, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతాలో పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.