- వివాహేతర సంబంధం మానుకోనందుకే హత్య
- పోలీసుల విచారణలో ఒప్పుకున్న నిందితులు
రాప్తాడు మండలం బుక్కచెర్లకు జయచంద్రారెడ్డి, అశోక్‌రెడ్డిల కేసులో నిందితులను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రం రూరల్ పోలీసుస్టేషన్‌లో సీఐ కష్ణమోహన్ మీడియాకు వెల్లడించారు. జయచంద్రారెడ్డి గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా అతను పద్ధతి మార్చుకోకపోవడంతో రాప్తాడు మండలం గాండ్లకొత్తపల్లికి చెందిన బాల సోమనాథ్, గొల్లప్రతాప్, బుక్కచెర్లకు చెందిన పూజారి లక్ష్మినారాయణలు జయచంద్రారెడ్డి హత్యకు కుట్రపన్నారు. అందులో భాగంగా ఈ నెల 11న రాత్రి అనంతపురం నుంచి ఇంటికి ఆటోలో వెళుతున్న జయచంద్రారెడ్డిని కక్కలపల్లి సమీపంలో అటకాయించారు. గొంతునులిమి హత్య చేశారు. జయచంద్రారెడ్డి వెంట అశోక్‌రెడ్డి కూడా ఉండడంతో ఎక్కడ సాక్ష్యం చెబుతాడోననే ఉద్దేశంతో ఆటోను స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడుతో ఉరితీశారు. ఇద్దరినీ రోడ్డు పక్కన పడేసి వెల్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితులు సోమవారం బుక్కచెర్ల వీఆర్వో సాకే ప్రసాద్ ఎదుట లొంగిపోయారు. ఆయన నేరుగా ముద్దాయిలను సీఐ కష్ణమోహన్‌కు వద్దకు పిలుచుకొచ్చారు. నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించి ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్, తాడును సీఐ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జగదీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.