మాట్లాడుతున్న కమిషనర్ మహేశ్ భగవత్
సాక్షి, సిటీబ్యూరో: అద్దె ఎక్కువ ఇస్తామన్నారని ముందు, వెనుక ఆలోచించకుండా ఎవరికి బడితే వారికి ఇల్లు కిరాయికి ఇచ్చేయకండి. ఇంట్లో దిగిన వారు వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కితే... ఇక ఆ ఇల్లు సీజ్ అయిపోతుంది. నగరంలో వ్యభిచార దందా నియంత్రించే దిశగా రాచకొండ పోలీసులు ముందుకెళ్తున్నారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలో ఈ ఏడాది జులై ఒకటి నుంచి ఇప్పటివరకు మహిళల అక్రమ రవాణాపై 23 కేసులు నమోదు చేసి.. 75 మంది నిందితులను అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌కు చెందిన 40 మంది బాధితులకు వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు.
అంతటితో ఆగకుండా ఇటువంటి ఆరాచకాలు సాగకుండా ఉండేందుకు వ్యభిచార గృహాలను సీజ్ చేసే దిశగా చర్యలు చేపట్టారు. రాచకొండ పోలీసుల అభ్యర్థన మేరకు నాలుగు అపార్ట్‌మెంట్‌లను తహసీల్దార్ తనకున్న ఎగ్జిక్యూటివ్ మేజి స్ట్రేట్ అధికారాలతో అధికార పరిమితులతో సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. వీటిలో సరూర్‌నగర్ మండలం అల్కాపురిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్, దిల్‌సుఖ్‌నగర్ లలితానగర్‌లో ఒక ఫ్లాట్, కర్మన్‌ఘాట్ జ్యోతినగర్‌లో ఒక ఫ్లాట్, కొత్తపేట న్యూ మారుతీనగర్‌లో ఒక ఫ్లాట్‌ను స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు సీజ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
అలాగే రాచకొండ పోలీసుల అభ్యర్థన మేరకుSవ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్లాట్స్‌కు సంబంధించిన మరో ఆరు అపార్ట్‌మెంట్‌లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డిలతో కలిసి రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో వ్యభిచార దందాలో నిర్వాహకులను పట్టుకునే క్రమంలో ఆ ఇళ్లలో మైనర్లు దొరికితే మూడేళ్ల పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం మేజిస్ట్రేట్‌కు ఉందని, మేజర్‌లు దొరికితే మూడు నెలల నుంచి ఏడాది పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం ఉందని మహేష్ భగవత్ తెలిపారు.
అసాంఘిక హోటళ్లపై చర్యలే...
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొన్ని హోటళ్లలో వ్యభిచారం జరుగుతున్నట్టు మా వద్ద సమాచారం ఉంది. అటువంటి పనులు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. వ్యభిచార దందాలో దొరికిపోతే ఆ హోటల్ లైసెన్స్‌ను మూడు నెలలు నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తారని, వ్యభిచారం చేస్తూ మైనర్లు పట్టుబడితే సదరు హోటల్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం రాచకొండ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ నర్సింగ రావు, ఇన్‌స్పెక్టర్ సురేందర్‌లకు రివార్డులు అందజేశారు.
కిరాయిదారులపై దృష్టి పెట్టండి...
ఇంటిని కిరాయికి తీసుకున్న వారిపై యజమానుల పర్యవేక్షణ ఉండాలి. ఎక్కువ అద్దె ఇస్తున్నారని ఎవరికి పడితే వారికి ఇల్లు కిరాయికి ఇచ్చి.. వారు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోతే ఇబ్బందులు తప్పవు. అద్దెకుండే వారు వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ సందర్భంలో ఆ ఇంటిని సీజ్ చేస్తాం. నాకు మేజిస్ట్రేట్ హోదా రాగానే వ్యభిచార నిర్వాహకులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తా.
– మహేష్ భగవత్, రాచకొండ సీపీ