బంజారాహిల్స్: నిశ్చితార్థం చేసుకొని.. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న ఓ ఎన్‌ఆర్‌ఐ ఇంతలో తనకు ఈ వివాహం ఇష్టం లేదని ప్లేటు ఫిరాయిం చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ ప్రబుద్ధుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో నివాసముండే యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న వరుణ్‌తో పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 26న పెళ్లి జరిపించేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ వరకు వరుణ్ కాబోయే భార్యతో చాటింగ్ చేసేవాడు. ఫొటోలు కూడా షేర్ చేసేవాడు.
అయితే ఇటీవలే అకస్మాత్తుగా వరుణ్ ఆమెతో మాటలు బంద్ చేశాడు. ఎన్నోసార్లు ఆమె ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘‘నీ ప్రవర్తన మం చిది కాదని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. రూ.20 లక్షలు అదనపు కట్నం కావాలి’’ అని షరతు పెట్టాడు. చివరకు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అంతేకాకుండా అమ్మాయి చాలా అడ్వాన్స్‌గా ఉందంటూ మరో ప్రచా రం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుణ్‌తో పాటు తల్లి పూర్ణిమ, తండ్రి వినోద్‌కుమార్‌లపై ఐపీసీ సెక్షన్ 417 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.