- రవాణా వాహనాల లేక ప్రయాణికుల ఇక్కట్లు
- వైరామవరంలో దుకాణాల బంద్
మన్యం బంద్ పాక్షికం
Published Thu, Nov 3 2016 9:34 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
రంపచోడవరం :
ఆంధ్రా, ఒడిషా బోర్డర్ (ఏఓబీ) పరిధిలోని మల్కనగిరి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన పోలీసు ఎదురు కాల్పులకు నిరసనగా మావోయిస్టులు గురువారం తలపెట్టిన బంద్ జిల్లా ఏజెన్సీలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 11 ఏజెన్సీ మండలాల నుంచి సాయంత్రానికి అందిన సమాచారం ప్రకారం ఎక్కడా ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మండల కేంద్రమైన వై రామవరంలో దుకాణాల మూసివేత, ఏజెన్సీ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సర్వీసుల నిలిపివేతతో బంద్ పాక్షికంగా ముగిసింది.వై రామవరం మండలంలో ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా తిరగలేదు.
నిర్మానుష్యంగా
ఆంధ్రా–చత్తీస్‌గఢ్ రహదారి
మావోయిస్టుల బంద్ పిలుపుతో గురువారం ఆర్టీసీ సర్వీసులు, ప్రయివేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆంధ్రా–చత్తీస్‌గఢ్‌లోని జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. దీంతో ఆంధ్రా, చత్తీస్‌గఢ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రజారవాణాకు ఆటంకం కలిగింది. రాజమండ్రి, విశాఖ, విజయవాడ, కాకినాడ ,గోకవరం , రావులపాలెం ఆర్టీసీ డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంతానికి బస్సు సర్వీసులను నిలిపివేశారు. విలీన మండలమైన ఎటపాక నుంచి డొంకరాయి వరకూ పోలీసులు ఆటోలు ఏర్పాటు చేయడంతో కొంత ఇబ్బంది పడ్డా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోగలిగారు. చత్తీస్‌గఢ్ , ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.గోకవరం –రంపచోడవరంల మధ్య మాత్రం ఆర్టీసీ బస్సు సర్వీసులు యథావిధిగా నడిచాయి. రాజవొమ్మంగి, గంగవరం, మారేడుమిల్లి, అడ్డతీగల మండల కేంద్రాలతో పాటు లోతట్టు ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు.
సరిహద్దులో అదనపు బలగాలు
బంద్ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రంపచోడవరం –భద్రాచలం మార్గంలోని రంపచోడవరం, మారేడుమిల్లి , చింతూరు పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.అలాగే భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఎస్పీ రవిప్రకాశ్ ఏజెన్సీలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.
54 ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత
రాజమహేంద్రవరం సిటీ : ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ నేపథ్యంలో గురువారం రాజమహేంద్రవరం, కాకినాడ డిపోల నుంచి ఏజెన్సీకి వెళ్లే బస్సులను రద్దు చేసినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. అలాగే గోకవరం, ఏలేశ్వరం డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంత బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేశామన్నారు. వివిధ డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మొత్తం 54 సర్వీసులను నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. బంద్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం కూడా ఈ డిపోలకు చెందిన బస్సులను అధికారులు నిలిపి వేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
Advertisement