రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుదాం
Published Mon, Sep 12 2016 11:10 PM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM
– 15న సామూహిక నిరాహారదీక్ష
– రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం పిలుపు
తిరుపతి కల్చరల్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు పోరాడుదామని, ఈనెల 15న సామూహిక నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం... ప్రత్యేక హోదా సాధిద్దాం’ అనే అంశంపై తిరుపతి యశోదనగర్‌లోని ఎంబీ భవన్‌లో సోమవారం అఖిలపక్ష నాయకుల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్యాకేజీ జేబులు నింపుకోవడానికి ఉపయోగపడుతాయే తప్ప రాష్ట్రాభివృద్ధి కాదన్నారు. మోదీ, బాబు తిరుపతి ఎన్నికల సభలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి నేడు నిరాకరించడం దగాకోరుతనమేన్నారు. ప్యాకేజీ తాత్కాలిక భిక్ష మాత్రమేనని, హోదా శాశ్వత పరిష్కారమన్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ విభజనకు కారకులు బీజేపీ, టీడీపీ నాయకులే అన్నారు. వీరే ప్రత్యేక హోదాను విస్మరించడం దుర్మార్గమన్నారు. హోదాకు చట్ట సవరణ చేయాల్సిన పని లేదని, ప్రధానే ఇవ్వచ్చని రాజ్యంగంలో ఆ వెసులుబాటు ఉందన్నారు. కేజీ బేసిన్ గ్యాస్ ద్వారా వచ్చే 50 శాతం నిధులను ముఖ్యమంత్రి ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను బతికించే దశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం బంద్ చేపడితే అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు. ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజకీయాలకు అతీతంగా పోరాడదామని పిలుపు నిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు మాట్లాడుతూ పోలీసులు నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరని చంద్రబాబుకు హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఉద్యమిస్తామని తెలిపారు. జనసేన పార్టీ నేత కిరణ్‌రాయల్ మాట్లాడుతూ హోదా కోసం పవన్ కల్యాణ్ కట్టుబడి ఉన్నాడని, ప్రభుత్వ తీరును బట్టి పోరాటాలు రూపకల్పన చేసి ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా అనేక ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. అనంతరం ఈనెల 15న సామూహిక నిరాహారదీక్ష చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం సీపీఐ నగర కార్యదర్శులు సుబ్రమణ్యం, చిన్నం పెంచలయ్య, బీసీ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, సీఐటీయూ చంద్రశేఖర్‌రెడ్డి, డీవైఎఫ్‌ఐ జయచంద్ర, ఐద్వా సాయిలక్ష్మి, పీఎన్‌ఎం నేత శ్రీనివాసులు, నవసమాజ ఫెడరేషన్ నాయకుడు నరేష్, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మణి, రాజేంద్ర, సాకం ప్రభాకర్, ఐఎన్‌టీయూసీ అనూషా, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement