- స్పందించకపోతే జూలై 15న జాతీయ రహదారులు దిగ్భంధం
- బాధితుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు హెచ్చరిక
తిరుపతి కల్చరల్: అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా తీవ్రంగా నష్టపోయిన బాధితులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపడంతో ఇప్పటివరకు 96 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసంతో ఆంధ్రరాష్ట్రంతో పాటు 8 రాష్ట్రాల్లో లక్షలాదిమంది దగా పడ్డారని పేర్కొన్నారు. 1995 నుంచి అగ్రిగోల్డ్ విష వృక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిపోషిస్తే అప్పటి మంత్రులు ఆ సంస్థకు ఐఎస్‌వో గుర్తింపు సైతం ఇచ్చి ప్రజల్లో నమ్మకాన్ని కల్పించారని తెలిపారు.
ఫలితంగానే లక్షలాది మంది ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని అనేకసార్లు పోరాటాలు చేసినా, అసెంబ్లీలో ప్రస్తావించినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ సమస్యపై కోర్టు స్పందించినా గత 18 నెలలుగా రోడ్లపై పడి మొత్తుకుంటుంటే పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విచార కరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే వెయ్యి కోట్లు కేటాయించి అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలని డిమాండ్ చేశారు.
అలాగే సీఐడీ వద్దనున్న అగ్రిగోల్డ్ బాధితుల డేటా ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. లేని పక్షంలో జూలై 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారుల దిగ్బంధం చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని సైతం ముట్టడిందుకు కూడా తాము సిద్ధమేనన్నారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుపతి రావు, జిల్లా నేతలు శివరామకృష్ణ, కృష్ణదేవరాజు, శ్రీనివాసులు, వెంకటేష్, సుధాకర్ పాల్గొన్నారు.