మద్దతు ధరపై ప్రచారం శూన్యం !
ఖరీఫ్ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరలు
– వేరుశనగ క్వింటా రూ.4,220, పత్తి రూ.4,100
– ప్రచారం కల్పించని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2016లో పండించిన వ్యవసాయోత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు (మినిమం సపోర్ట్ ప్రైసెస్–ఎంఎస్‌పీ) పంటల వారీగా ఇది వరకే ప్రకటించారు. వేరుశనగ, కంది, పత్తి, మొక్కజొన్న, పెసలుతో పాటు కొద్దిగా చిరుధాన్యాలకు సంబంధించిన పంటలు జిల్లాలో అధికంగా పండిస్తున్న విషయం తెలిసిందే. పంట పెట్టుబడులు, దిగుబడుల ఆధారంగా ఏటా ఎంఎస్‌పీ ప్రకటిస్తున్నారు. గతేడాదితో పోల్చిచూస్తే ఈ సారి మద్దతు ధరలు స్వల్పంగా పెరిగాయి. వేరుశనగ పంటకు మద్దతు ధర రూ.4,220గా నిర్ణయించారు. గతేడాదితో పోల్చితే క్వింటాపై రూ.250 పెంచారు. ఇందులో రూ.100 బోనస్‌గా చేర్చారు. అలాగే కందికి కూడా బోనస్ కింద 425 ప్రకటించారు.
ప్రచారం నిల్ : అయితే మద్దతు ధరల (ఎంఎస్‌పీ)పై మార్కెటింగ్, వ్యవసాయశాఖలు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో అరకొరగా పండిన వేరుశనగను తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితి నెలకొంది. దళారులు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా రైతుల్ని మోసం చేస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 20 శాతం పంట దిగుబడులు సాధించిన రైతులు పెట్టుబడులు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చిన పంటకు సరైన ధరకు అమ్ముకుందామనుకున్నా కొనేవారు కరువయ్యే పరిస్థితి కల్పించారు. నాణ్యత లేదనే సాకుతో క్వింటా రూ.3,800 నుంచి రూ.4 వేల లోపు అమ్మేస్తున్నారు. అందులోనూ తూకాల్లో మోసం జరుగుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎంఎస్‌పీ కన్నా ధరలు తక్కువగా ఉన్నపుడు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ.. జిల్లాలో మొక్కజొన్న, రాగులు, సజ్జలు, కొర్రలకు మాత్రమే నాలుగైదు చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి అరకొరగా సేకరిస్తోంది. పంటల వారీగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఇలా ఉన్నాయి.
పంట ఈ ఏడాది ధరలు గతేడాది ధర
––––––––––––––––––––––––––––––––––
వేరుశనగ 4,220 4,030
వరి (ఏ–గ్రేడ్) 1,510 1,450
వరి (సాధారణ రకం) 1,470 1,410
మొక్కజొన్న 1,365 1,325
ప్రత్తి –మీడియంరకం 3,860 3,800
ప్రత్తి– పొడవు రకం 4,160 4,100
మినుములు 5,050 4,625
పెసలు 5,000 4,850
కందులు 5,050 4,625
జొన్నలు (హైబ్రీడ్) 1,625 1,570
జొన్నలు (మాల్‌దండి) 1,650 1,590
రాగులు 1,725 1,650
సజ్జలు 1,330 1,275
సోయాబీన్ 2,775 2,600
పొద్దుతిరుగుడు 3,950 3,800
నువ్వులు 4,700 5,000