ఒకే గూటికి పోలీస్
-
అర్బన్ జిల్లా పరిధిలో చురుగ్గా భవనాల నిర్మాణం
-
త్వరలోనే ప్రారంభోత్సవాలు
రాజమహేంద్రవరం క్రైం :
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్ కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి. సుమారు 17. 47 కోట్లతో అర్బన్ కార్యాలయం, డిస్ట్రిక్ ఆర్‌్మడ్ ఫోర్స్ కార్యాలయం, బెల్ ఆఫ్ ఆర్‌్మ్స(ఆయుధ గారం), డీఐజీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం తదితర భవనాలన్నింటినీ రాజమహేంద్రవరం లాలా చెరువు వద్దగల ఓఎన్‌జీసీ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ పోలీస్ కార్యాలయాలకు సరైన భవనాలు లేక శి«థిలావస్థకు చేరిన భవనాల్లోనే కొనసాగాయి. జాంపేట వద్ద ఆర్‌్మడ్ రిజర్వు కార్యాలయం పూర్తిగా పాడైపోయింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు చేరడంతో తాత్కాలికంగా నిర్మించిన భవనంలో పరిపాలన సాగిస్తున్నారు. అన్ని డీఎస్పీ కార్యాలయాలు అద్దె భవనాలలోనే పరిపాలన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ ఓకేచోట నిర్మిస్తున్నారు.
రూ.14 కోట్లతో..
అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయం రూ. 14 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. ఈ భవనంలో పరిపాలన, మినిస్ట్రీయల్, వేలిముద్రల టీమ్, ఐటీ టీమ్, క్రైం తదితర శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. అలాగే క్రైం సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు పెద్ద కాన్ఫెరెన్స్ హాల్ కూడా నిర్మిస్తున్నారు.
ప్రత్యేక ఆయుధ గారం
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాకు సంబంధించిన ఆయుధ గారం బెల్ ఆఫ్ ఆర్మ్స్ (ఆయుధ గారం) ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అధునాతన ఆయుధాలు దాచేందుకు వీలుగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. చుట్టూ రక్షణ కంచెతో నిర్మించిన ఈ భవనంలో ఆయుధాలు దాచేందుకు వీలుగా నిర్మాణం జరిగింది. ఆర్‌్మడ్ రిజర్వు ఫోర్స్ ఇక్కడ నుంచే కార్యాకలాపాలు సాగిస్తుంది.
సీఐడీ భవనం
సీఐడీ భవనం ప్రస్తుతం ఏవీ అప్పారావు రోడ్డులో అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ విభాగపు నూతన భవనాన్ని రూ 3.47 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు వేగవంతగా జరుగుతున్నాయి. ఈ భవనం 2017 జనవరి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కాగా..అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
త్వరలో నూతన భవనాల్లోకి..
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయం మరో నెల రోజుల్లో పూర్తికానుంది. త్వరలోనే ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రస్తుతం అద్దె భవనాల్లో పోలీస్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. –బి.రాజకుమారి, అర్బన్ ఎస్పీ