కళ్యాణదుర్గం రూరల్ : మండల పరిధిలోని బోరంపల్లి పోస్టాఫీసులో డిపాజిట్ల గోల్‌మాల్‌పై ఖాతాదారులు మంగళవారం ఆందోళనకు దిగారు. తాము డిపాజిట్ చేసిన డబ్బు ఏమైందో తెలపాలంటూ స్థానిక పోస్టాఫీసు వద్ద పోస్ట్‌మాస్టర్ (గ్రేడ్1)జగదీశ్వరతో ఖాతాదారులు లక్ష్మిదేవి, ఈరక్క, కె.లక్ష్మి, శకుంతలమ్మ, రత్నమ్మ, వంకా సరస్వతి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కొంత మేరకు పోస్టాఫీసును నమ్మి నగదు డిపాజిట్ చేస్తే బీపీఎం రామ్మూర్తి అడ్రస్సు లేకుండా పోయాడన్నారు. గ్రామంలో 60 మంది దాకా ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున రూ.6లక్షల వరకు డిపాజిట్లు చేశామన్నారు.
బీపీఎం రాక పోవడంతో వివరాలు ఆరా తీస్తే పోస్టాఫీసులో డిపాజిట్లు కట్టకుండా కట్టినట్లు తమకు పోస్టాఫీసు సీలు మాత్రం వేసి నగదు వాడుకున్నారన్నారు. తమ డిపాజిట్లు ఎక్కడ అని నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని మండిపడ్డారు. ఇందులో పోస్టాఫీసు అధికారులు వత్తాసు పలకడంతో బీపీఎం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. తాము కూలీ నాలీ చేసి దాచుకున్న సొమ్ము డిపాజిట్ రూపంలో పోస్టాఫీసుకు చెల్లిస్తే ఇలా మోసం చేయడం అన్యాయమన్నారు.
గోల్‌మాల్ చేసిన సొమ్ము చెల్లించకుంటే తీవ్ర ఆందోళన వ్యక్తం హెచ్చరించారు. ఇందుకు పోస్ట్‌మాస్టర్ జగదీశ్వర స్పందిస్తూ రామ్మూర్తి సెలవులో ఉన్నాడని, విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. మూడు నెలలు ఓపిక పట్టాలని ఆందోళనకారులకు సర్ధిచెప్పడంతో వారు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఖాతాదారులు వన్నూర్‌బీ, ఆనం అంజినమ్మ, వంకామీనక్షమ్మ, నాగలక్ష్మితో పాటు చాలా మంది ఖాతాదారులు ఉన్నారు.
పోస్టాఫీసులో డిపాజిట్ల గోల్‌మాల్‌పై ఆందోళన
Published Wed, Mar 1 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement
Advertisement