ఉత్కంఠకు తెర
ఉత్కంఠకు తెర
Published Wed, Sep 28 2016 11:49 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
హైకోర్టులో రెండు రిట్లు రేపటికి వాయిదా
నేడు యథావిధిగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
చైర్మన్‌గా గణేష్ ఏకగ్రీవానికి రంగం సిద్ధం
సాయంత్రం వరకూ పట్టణ టీడీపీ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్
అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిలిపివేయాలంటూ పట్టణ టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు హైకోర్టులో వేసిన రెండు రిట్ పిటిషన్లు ఆ పార్టీ వర్గాలకు కునుకు లేకుండా చేశాయి. అయితే ఈ రెండు పిటిషన్లు ఈ నెల 30కి వాయిదా వేయడంతో బుధవారం సాయంత్రం ఊపిరి పీల్చుకున్నారు. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాలులో జరగనున్న చైర్మన్ ఎన్నికను యథావిధిగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ గణేష్‌కుమార్ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే టీడీపీ వర్గీయులు సీనియర్ కౌన్సిలర్ చిక్కాల గణేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నికునేందుకు రంగం సిద్ధం చేశారు. మంత్రి రాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావు, పట్టణ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా గణేష్‌నే ఏకగ్రీవంగా ఎంపిక చేయడంతో గురువారం ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. కౌన్సిల్ కాల పరిమితిలో ఇంకా 33 నెలలు మిగిలి ఉండడంతో తాజాగా జెంటిల్‌మెన్ ఒప్పందం ద్వారా గణేష్‌కు రెండేళ్లు, మిగిలిన కాలాన్ని దివంగత చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు తనయుడు యాళ్ల నాగ సతీష్ చైర్మన్ పదవులు చేపట్టేలా నిర్ణయించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగానే గణేష్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారానికి కూడా కమిషనర్ ఏర్పాట్లు చేస్తున్నారు.
సాయంత్రం వరకూ అందరిలోనూ టెన్షన్:
దివంగత చైర్మన్ మల్లేశ్వరరావు మృతితో ఖాళీ అయిన 4వ వార్డుకు ఎన్నికలు నిర్వహించిన తర్వాతే చైర్మన్ ఎన్నిక చేపట్టాలని అంతవరకూ చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలంటూ పట్టణానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో పట్టణ టీడీపీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ రిట్ పిటిషన్లతో చైర్మన్ ఎన్నిక స్టేతో ఎక్కడ ఆగిపోతుందేమనని ఆందోళన చెందారు. రెండు రిట్ ఫిటిషన్లు బుధవారానికి వాయిదా వేయడంతో సాయంత్రం వరకూ పట్టణ టీడీపీ శ్రేణులు టెన్షన్‌తో గడిపాయి. ఎట్టకేలకు సాయంత్రానికి రెండు పిటిషన్లను శుక్రవారానికి వాయిదా వేయటంతో టెన్షన్ నుంచి బయటపడ్డారు.
రేపటి వాయిదాలపైనా గుబులు
గురువారం జరిగే చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని రిట్ పిటిషన్లు హైకోర్టులో వేసినప్పుడు జరగాల్సిన ఎన్నికకు పరోక్షంగా వాయిదాల వెసులబాటుతో టీడీపీ శ్రేణులు ఊరట చెందుతున్నా శుక్రవారం ఏమవుతోందనని గుబులు కూడా వెంటాడుతోంది. అయితే ఎన్నికకు అడ్డు లేకుండా స్టే ఇవ్వలేని పరిస్థితి ఉండడంతో ఆ రోజు కూడా సానుకూలం కాగలదని భావిస్తున్నారు. రిట్‌లు వేసిన టీడీపీ నాయకులు మాత్రం శుక్రవారం నాటి వాయిదాలపై కూడా నమ్మకం పెట్టుకున్నారు. తమ న్యాయమైన అభ్యర్థనను కోర్టు స్వాగతిస్తుందన్న దీమాతో ఉన్నారు.
Advertisement
Advertisement