పరోక్ష పద్ధతిలోనే కార్పొరేషన్ ఎన్నికలు!
పరోక్ష పద్ధతిలోనే కార్పొరేషన్ ఎన్నికలు!
Published Wed, Nov 30 2016 11:08 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
– ప్రత్యక్ష పద్ధతిలో గెలవలేమన్న భావనలో అధికార పార్టీ
– సీఎం వద్ద సమావేశంలో నిర్ణయం?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కార్పొరేషన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో గెలవలేమని అధికార పార్టీ భావిస్తోంది. పరోక్ష పద్ధతిలోనే మేయర్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నికలు జరిగితే.. గెలిచే అవకాశాలు లేవనే నిర్ణయానికి అధికారపార్టీకి వచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లు కూడా అధికార పార్టీకి అనుకూలంగా లేరని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మైనార్టీలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని.. బీజేపీతో పొత్తు ఉన్నందున ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోందని అధికార పార్టీ భావిస్తోంది. కార్పొరేషన్ పరిధిలోని పలువురు అధికార పార్టీ నేతల మధ్య సమన్వయ లేమితో పాటు అంతర్గత విభేదాలు కొంప ముంచుతాయనే భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా పరోక్ష పద్ధతిలోనే జరపాలని మాత్రం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ప్రత్యక్షంగా గెలవలేం
కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా ముస్లిం, క్రైస్తవులతో పాటు రెండు, మూడు కులాలు అధికార పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో పాటు బీజేపీతో పొత్తు, అధికార పార్టీలోకి ఎమ్మెల్యే జంప్ కావడం వంటి కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఈ వర్గాలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాయని స్వయంగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే కార్పొరేషన్ ఎన్నికలు జరపకుండా వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ అప్పటికీ జరిపే ధైర్యం ప్రభుత్వానికి లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పరోక్ష పద్ధతిలో నిర్వహించి.. ఓటుకు నోట్ల ద్వారా గట్టెక్కేందుకు ప్రయత్నిద్దామని అధికార పార్టీ నేతల భావనగా ఉంది. అయితే, క్రమంగా సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఎవ్వరు కూడా అంత సులువుగా పార్టీ మారే అవకాశం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
ప్రత్యక్ష–పరోక్ష పద్ధతి అంటే..
ప్రత్యక్ష పద్ధతి అంటే నేరుగా మేయర్ అభ్యర్థి ఎవరనే విషయాన్ని బరిలో దిగిన పార్టీలు ప్రకటిస్తాయి. సదరు అభ్యర్థి గెలవడంతో పాటు ఆ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తే మేయర్‌గా ప్రకటించిన అభ్యర్థి నేరుగా ఈ సీట్లో కూర్చుంటారు. ఇక ఈ పద్ధతిలో ఓటింగ్ ఉండదు. పరోక్ష పద్ధతిలో అంటే గెలిచిన అభ్యర్థుల ద్వారా మేయర్‌ను ఎన్నుకుంటారు. ఈ పద్ధతిలో మేయర్ అభ్యర్థి ఎవరనే అంశాన్ని ఏ పార్టీ కూడా నేరుగా ప్రకటించదు. అంతేకాకుండా ఎన్నికలు జరిగిన తర్వాత మెజార్టీకి అవసరమైన సీట్లు గెలవకపోయినప్పటికీ అవతలి పార్టీలోని కార్పొరేటర్లను లాక్కోవడం ద్వారా కూడా మేయర్ సీటును కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. పరోక్ష పద్ధతిలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లను కూడా లెక్కిస్తారు. ఇది తమకు కలిసి వస్తుందని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అందువల్ల పరోక్ష పద్ధతిలోనే ఎన్నికలకు వెళదామనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంటే రాబోవు రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటుకు నోటు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు అర్థమవుతోంది.
Advertisement
Advertisement