అనంతపురం, కర్నూలు జట్ల విజయం
అనంతపురం న్యూసిటీ : ఏఎస్‌ఏ అండర్ –16 అంతర్ జిల్లాల పోటీల్లో అనంతపురం, కర్నూలు జట్లు ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి. ఆదివారం అనంతపురం క్రికెట్ స్టేడియంలో కర్నూలు, వైఎస్సార్‌జిల్లా, అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. అనంతపురంతో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు జట్టు 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. జట్టులో సింధూజ 58, అనూష 28 పరుగులు చేసింది. అనంతపురం జట్టు 23.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో పల్లవి 34, అనూష 29 పరుగులు చేశారు. దీంతో అనంతపురం జట్టు 5 వికెట్ల తేడాతో నెల్లూరుపై నెగ్గింది.
కడప జట్టు బోల్తా..
లక్ష్య ఛేదనలో కడప జట్టు బోల్తాపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో అనూష 40, సుప్రజ 29 పరుగులు చేశారు. కడప బౌలర్ జ్యోతిక 3/19 వికెట్లు తీసుకున్నారు. 148 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన కడప జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో ఓబుళమ్మ 60 పరుగులు చేసింది. కర్నూలు బౌలర్లలో అరుణ, సుప్రజ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు.