‘ఖేలో ఇండియా’లో అనంత హవా
- బాల బాలికల విభాగాల్లో విజయకేతనం
- ముగిసిన అండర్-17 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్
శ్రీకాకుళం న్యూకాలనీ : ఖేలో ఇండియా రాష్ట్ర ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను అనంతపురం క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఇటీవల ముగిసిన అండర్–14 విభాగంలోనూ అనంత జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కోడిరామ్మూర్తి స్టేడియం, నైర వ్యవసాయ కళాశాల, కేంద్రీయ విద్యాలయం క్రీడా ప్రాంగణాల్లో ఽమూడు రోజులుగా సాగిన ఖేలో ఇండియా రాష్ట్ర బాలబాలికల అండర్–17 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి.
అనంత అదరహో..
శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో బాలుర విభాగంలో జరిగిన తుది పోరులో కృష్ణా జిల్లాపై 2–0 గోల్స్ తేడాతో అనంతపురం జట్టు జయభేరి మోగించి ట్రోఫీ దక్కించుకుంది.
బాలికల్లోనూ..
బాలికల విభాగంలో వైఎస్సార్ కడప జిల్లాతో సాగిన హోరాహోరీ ఫైనల్స్ పోరులో అనంతపురం జట్టు చాంపియన్‌గా నిలిచింది. తుదిపోరులో 1–0 గోల్స్ తేడాతో విజయభేరి మోగించింది.
బహుమతుల ప్రదానం
శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం బహుమతులు ప్రదానం చేశారు. మెరుగైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన డీఎస్‌డీఓ శ్రీనివాస్‌ను కలెక్టర్ అభినందించారు. పోటీలు విజయవంతంగా ముగియానికి సహకరించిన ప్రతి ఒక్కరికి డీఎస్‌డీఓ కృతజ్ఞతలు తెలిపారు.