రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్ వంటి విశ్వనగరంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలు, సినీ పరిశ్రమ, మౌలిక వసతులు కోల్పోయిందని ప్రొఫెసర్ రామకృష్ణారావు అన్నారు.
శ్రీకాకుళం: రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్ వంటి విశ్వనగరంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలు, సినీ పరిశ్రమ, మౌలిక వసతులు కోల్పోయిందని ప్రొఫెసర్ రామకృష్ణారావు అన్నారు. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ వాటా 22 శాతం ఉండేదని, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పారు. దీంతో ఏపీ లోటు రాష్ట్రంగా, తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం శ్రీకాకుళం టౌన్హాల్లో ఏర్పాటు చేసిన యువభేరీలో రామకృష్ణారావు మాట్లాడారు. ఈ సభలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే అధికంగా నిధులు వస్తాయని, ఎన్నో లాభాలు కలుగుతాయని రామకృష్ణారావు చెప్పారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్కు కూడా ఇవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానాలు చేసిన పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని విమర్శించారు. బీజేపీ నేతలు ఇందుకు పలు కారణాలు చెబుతున్నారని అన్నారు.