పట్టణంలోని ఎనిమిదో వార్డుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త, సెక్టార్ లీడర్ నక్కాన కృష్ణవేణి శనివారం రాత్రి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
బొబ్బిలి: పట్టణంలోని ఎనిమిదో వార్డుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త, సెక్టార్ లీడర్ నక్కాన కృష్ణవేణి శనివారం రాత్రి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇంట్లో పురుగుమందు తాగి అచేతనంగా పడి ఉన్న ఆమెను సహచర కార్యకర్తలు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... కృష్ణవేణి సీడీపీఓను అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని కొందరు కార్యకర్తలు ఆర్డీడీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై ఐసీడీఎస్ అధికారులు సోమవారం విచారణ జరపనున్నారు.
ఇదిలా ఉంటే మూడు రోజులుగా సీడీపీఓ సుశీల ఫిర్యాదు చేసిన కార్యకర్తలను కార్యాలయానికి పిలుపించుకుని కృష్ణవేణికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని హెచ్చరిస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం కూడా కొంతమంది కార్యకర్తలను పీఓ పిలిపించుకుని విచారించింది.
ఆ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యకర్త కృష్ణవేణిని పక్కనే కూర్చోబెట్టుకోవడం వివాదానికి దారితీసింది. కృష్ణవేణిని పక్కనే కూర్చోబెట్టుకుని తమను భయబ్రాంతులకు గురిచేయడంపై కార్యకర్తలు శ్రీదేవి, రోజా, కల్యాణి, విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని, కార్యకర్తలను ఎందుకు పిలిపించారని సీడీపీఓను అడగ్గా, సోమవారం నాటి విచారణకు నోటీసులు అందివ్వడానికి పిలిపించానని బదులిచ్చింది.
అయితే ఈ వ్యవహారం వల్ల తన పరువు పోయిదని భావించిన కృష్ణవేణి ఒక్కసారిగా బయటకు వచ్చి ఇంటికి పరుగుతీసింది. అక్కడి వ్యవహారం బట్టి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని కొంతమంది కార్యకర్తలు వెనుక అనుసరించారు. ఇంటికి వెళ్లిన కృష్ణవేణి పురుగు మందు తాగడంతో సహచరులు ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.