కొల్లి అంకమ్మ
అందరూ ఉన్న అనాథ!
Published Sun, Jul 31 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
ఆమెకు కన్న బిడ్డలు ఉన్నారు... కానీ ఆకలి అంటే అన్నం పెట్టే వారు కరువయ్యారు. అయిన వారు చాలా మందే ఉన్నారు... దాహం వేస్తే గుక్కెడు నీరు అందించే వారు మాత్రం లేకపోయారు. జగమంత కుటుంబాన్ని నడిపించినా ఆఖరులో ఏకాకి జీవితాన్ని గడుపుతోంది. సత్తువ ఉన్నంత కాలం కుటుంబాన్ని రెక్కల కష్టంతో లాగినా... ఆ రెక్కలు పోయాక దిక్కులేని పక్షిలా గుడిసెకే పరిమితమైపోయింది. సొంత వారు పరాయి వారైపోయి, ఇరుగుపొరుగు వారు ఆప్తులైన వేళ ఆ ముదుసలి బతుకు శోకతప్తమైంది. కళ్లు కనిపించకపోయినా కన్నీరు పెట్టని రోజు లేదు, నోరు రాకపోయినా సంతానాన్ని తలిచి పిలవని రోజూ లేదు.
– పొందూరు
పొందూరు మండలంలోని బాణాం గ్రామంలో కొల్లి అంకమ్మ(80) జీవన చరమాంకంలో పడరాని కష్టాలు పడుతోంది. అంకమ్మ భర్త సూరినాయుడు 45 ఏళ్ల కిందటే చనిపోయారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. భర్త చనిపోయిన నాటి నుంచి అంకమ్మే కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. సంతానానికి పెళ్లిళ్లు చేసింది. కూతురు లావేరు మండలంలో అగ్రహారంలో తన భర్తతో పాటే ఉంటుంది. కొడుకు మాత్రం పొందూరు మండలంలోని దళ్లిపేట గ్రామంలో తన భార్య, పిల్లలుతో కలిసి ఉంటున్నాడు. వీరు పదేళ్ల కిందట తల్లిని విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అంకమ్మ కన్నీళ్లు మింగుకుంటూ, కష్టాలు అనుభవిస్తూ బతుకుతోంది. తల్లిని చూసేందుకు కూతురు అప్పుడప్పుడూ వచ్చి Ðð ళ్తూ ఉంటుంది. ఆమె వచ్చినప్పుడల్లా అంకమ్మ మురిసిపోతుంది. కానీ కొడుకు, కోడలు రావడం లేదనే దిగులు మాత్రం అంకమ్మను ఉండనివ్వడం లేదు. దీనిపై స్థానికులు కూడా కొడుకు, కోడలితో మాట్లాడినా ఫలితం లేకపోయింది.
ఊరివారే బంధువులు...
కొడుకు, కోడలు విడిచి పెట్టినప్పటి నుంచి అంకమ్మకు ఊరివారే బంధువులయ్యారు. వృద్ధాప్య పింఛన్, రేషన్ బియ్యంతో బతుకీడుస్తోంది. రోజూ వీధిలో రెండు కుటుంబాల వారు అంకమ్మ ఆకలి తీరుస్తున్నారు. అయితే అంకమ్మ నడవలేని స్థితిలో ఉండి మలమూత్రాలకు కూడా వెళ్లలేకపోతోంది. ఈ పరిస్థితిని కూడా ఎదురుగా ఉన్న ఓ వికలాంగురాలు గుర్తించి రోజూ అంకమ్మను ఎలాగోలా బయటకు తీసుకువచ్చి కాలకృత్యాలు తీర్చుకొనేలా చేస్తోంది. వికలాంగురాలు, వారి తల్లి, మరో ఇద్దరు మహిళలు వృద్ధురాలికి ఆకలి దప్పికలు తీరుస్తున్నారు.
నా కొడుకు పిలిస్తే వెల్లిపోతా...
వృద్ధురాలు ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతోంది. వర్షం పడితే ఆమె ఉండే గుడిసె మొత్తం బురదగా మారిపోతుంది. చలి వేస్తే కప్పుకునేందుకు దుప్పటి కూడా లేదు. తన కొడుకు పిలిస్తే వెంటనే వెళ్లిపోతానని ఆమె అంటున్నారు. కొడుకు పిలుపు కోసమే ఎదురు చూస్తున్నారు.
Advertisement