రెగ్యులర్ ఈఓ లేక అనిశ్చితి
చైర్మన్ రోహిత్ అనుభవరాహిత్యం
ఇన్‌చార్జి ఈఓ మెతకతనం
సత్యదేవుని ఆలయంలో రాజ్యమేలుతున్న వివాదాలు
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని ఆలయంలో పరిపాలన అధికారుల పట్టు జారుతోంది. ఈఓ కె.నాగేశ్వరరావును బదిలీ చేసి దాదాపు 40 రోజులైనా రెగ్యులర్ ఈఓను నియమించలేదు. ఇన్‌చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు మెతక వైఖరి, ఆయన హోదా తాత్కాలికమే కావడంతో సిబ్బంది ఆయనను ఖాతరు చేయడం లేదు. దీంతో ఆలయ పాలనలో అనిశ్చితి నెలకొంది.
దేవస్థానంలో సుమారు 30 ఏళ్ల పైబడి ఉద్యోగం చేస్తున్న జగన్నాథరావు ఈఓలు మారినప్పుడు, కొత్త ఈఓ రావడానికి మధ్య కాలంలో ఇన్‌చార్జి ఈఓగా సుమారు ఏడు పర్యాయాలు చేశారు. ఆ సమయంలో అప్పటి చైర్మన్ ఐవీ రామ్‌కుమార్ అండదండలు ఉండడంతో పాలన సజావుగా సాగించేవారు.
అనుభవ రాహిత్యంలో చైర్మన్ రోహిత్ :
రామ్‌కుమార్ ఆకస్మికమృతితో చైర్మన్‌గా వచ్చిన ఆయన కుమారుడు ఐవీ రోహిత్ అనుభవ రాహిత్యం వల్ల దేవస్థానంలోని వ్యవహరాలు పూర్తిగా అర్ధం కావడం లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో తెలియక చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీనిని అలుసుగా తీసుకుని కొంతమంది ఉద్యోగులు చిన్న వివాదాన్ని కూడా పెద్దదిగా చిత్రీకరించి ఆయనను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ఐవీ రామ్‌కుమార్‌కు రాజకీయ నాయకులతో కొంత పరిచయం ఉండేది. రోహిత్‌కు అటువంటి పరిచయాలేవీ లేకపోవడం కూడా ఆయనకు ప్రతిబంధకంగా మారింది. వీటికితోడు పాత ఈఓ నాగేశ్వరరావు అనుసరించిన విధానాలే కరెక్ట్ అనే అభిప్రాయంతో ఉండడం కూడా సిబ్బందికి ఆయనకు మధ్య దూరం పెంచుతోంది.
సిబ్బందిలో లోపించిన క్రమశిక్షణ:
పాత ఈఓ నాగేశ్వరరావు అనుసరించిన విధానాలపై పలు విమర్శలున్నా సిబ్బందిలో భయముండేది. ఆ భయం వల్ల క్రమశిక్షణతో ఉండేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సిబ్బందిలో కొంతమంది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెడితే బయోమెట్రిక్ అటెండెన్స్ సమయానికే మళ్లీ కొండమీదకు వస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది.
ఫేస్‌బుక్, వాట్సాప్ రాజకీయం:
భక్తులకు, సిబ్బందికి ఇబ్బందులు ఎదురైతే ఫొటోలు తీసి తనకు వాట్సఫ్‌లో పెట్టాలని పాత ఈఓ కే నాగేశ్వరరావు చెప్పేవారు. అయితే భక్తులు అలా వాట్సప్‌లో పెట్టినది తక్కువ. అయితే ప్రస్తుతం సిబ్బంది మాత్రం సీసీటీవీ పూటేజ్‌లను తిలకిస్తూ తమకు గిట్టని వారి గురించి ఆ సీసీటీవీ పూటేజ్‌లతో ఛైర్మన్, ఈఓ లకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది ఫేస్‌బుక్‌లో కూడా పెడుతున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకోవడం కూడా వివాదాస్పదమవుతోంది. దీంతో సిబ్బంది వర్గాలుగా చీలిపోతున్నారు. ఇదే అదనుగా కొంతమంది తమ పబ్బం గడుపుకునేందుకు సిబ్బందిని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనికితోడు అంతర్గత బదిలీలు కూడా ఏకపక్షంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది.
రెగ్యులర్ ఈఓ లేకపోతే మరంత ఇబ్బంది:
రూ.వంద కోట్లు పైబడిన ఆదాయం కలిగిన అన్నవరం దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను నియమించకుండా నెలల తరబడి కాలయాపన చేయడం కూడా సరి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈఓగా సీనియర్ ఆర్‌జేసీ, గతంలో ఇక్కడ పనిచేసిన ఎం.రఘునా«ద్ నియామకం ఖరారైందన్న వార్త నెల రోజులుగా చక్కర్లు కొడుతున్నా ఆదేశాలు మాత్రం వెలువడలేదు. ఆయనను ఈఓగా నియమించవద్దని దేవస్థానం ఉద్యోగుల సంఘం పేరుతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ఇక్కడ నెలకొన్న పరిస్థితికి తార్కాణం. అయితే ఆ ఫిర్యాదుతో తమకు సంబంధం లేదని ఆ నేతలు చెప్పడం గమనార్హం. దేవస్థానంలో నెలకొన్న పరిస్థితి ఇంకా ముదరకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రఘునా«థ్ కాకపోతే మరో సమర్థుడైన అధికారిని ఈఓగా ఇక్కడ నియమించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.