2019 నాటికి జెన్‌కో మూడో యూనిట్
-
స్వదేశీ బొగ్గుతో విద్యుదుత్పత్తి
-
ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బాలాజీ
ముత్తుకూరు:
మండలంలోని నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో సూపర్‌క్రిటికల్ థర్మల్ కేంద్రంలో మూడో యూనిట్ కింద తలపెట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు మరో 32 నెలల్లో పూర్తి కానుంది. ఈ యూనిట్ ద్వారా 2019 జూన్ 14వ తేదీన విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇదివరకే సేకరించిన భూముల్లో లెవలింగ్ పనులు పూర్తిచేసి, ఫౌండేషన్ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బాయిలర్, టర్బైన్ పనులను రూ.2,307 కోట్లతో బీహెచ్‌ఈఎల్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంస్థ కాంట్రాక్టు గత డిసెంబరు నుంచి మొదలైంది. మరో వైపు బ్యాలెన్స్ ఆఫ్ ప్రాజెక్టు(బీఓపీ) పనులను రూ.2,660 కోట్లతో టాటా సంస్థ చేపడుతోంది. ఈ సంస్థ 36 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది.
మంచినీటి ద్వారా విద్యుదుత్పత్తి
పూర్తిస్థాయిలో మంచినీటి ద్వారా విద్యుదుత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. దీంతో పాటు ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న 1, 2 యూనిట్లు కూడా మంచినీటితోనే విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తాయి. ఇందుకోసం ప్రప్రథమంగా రూ.600 కోట్లతో ‘ఫ్యూడైజ్డ్ డీ సల్ఫర్’(ఎఫ్‌జీడీ) ప్లాంటు నిర్మించనున్నారు. ఇప్పటి వరకు యాష్‌పాండ్‌లో సముద్రపునీటి రూపంలో విడుదలయ్యే బూడిద ఈ ప్లాంటు ద్వారా మంచినీటి రూపంలో విడుదలవుతుందన్న మాట.
స్వదేశీ బొగ్గుతో మూడో యూనిట్ –బాలాజీ, చీఫ్ ఇంజనీరు
జెన్‌కో ప్రాజెక్ట్‌లో నిర్మించే మూడో యూనిట్ ద్వారా పూర్తి స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీనికి తగిన టెక్నాలజీతో ప్రాజెక్ట్ నిర్మాణమవుతోంది. త్వరలో కోల్ లింకేజీ ఖరారవుతుంది. ఈ యూనిట్‌లో కాలుష్యం పరిమాణం కూడా చాలా తగ్గుతుంది. అనుకున్న గడువు కంటే ముందుగానే ఈ యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది.