ప్రై'వేటు' ప్రాక్టీసులకు ఇక చెక్ | AP Govt notices to govt doctors who have maintain private clinics | Sakshi
Sakshi News home page

ప్రై'వేటు' ప్రాక్టీసులకు ఇక చెక్

Published Mon, Jan 25 2016 11:50 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

ప్రై'వేటు' ప్రాక్టీసులకు ఇక చెక్ - Sakshi

ప్రై'వేటు' ప్రాక్టీసులకు ఇక చెక్

► ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై వేటుకు రంగం సిద్ధం
► నోటీసులిస్తామన్న మంత్రి కామినేని ప్రకటనతో డాక్టర్ల షాక్
► వైద్యరంగంలో కలకలం
 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న ప్రభుత్వ వైద్యులకు నోటీసులిస్తున్నాం. మొత్తం 600 మందిని గుర్తించి వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశా’ మన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటన జిల్లా వైద్యరంగంలో కలకలం రేపుతోంది. ఒంగోలు రిమ్స్‌తో పాటు పలు ఏరియూ వైద్యశాలలు, పీహెచ్‌సీల్లో పనిచేస్తూనే ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు, ఏకంగా నర్సింగ్‌హోంలు నిర్వహిస్తున్న వైద్యులను షాక్‌కు గురిచేసింది. ప్రధానంగా ప్రభుత్వ ఆస్పత్రుల పనివేళల్లో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్న వారిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానిలో భాగంగా గతంలో సిద్ధం చేసిన నివేదికకు ఇప్పుడు బూజుదులిపి బయటకు తీసినట్లు తెలుస్తోంది. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల్లో అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
 
నివేదికలో రిమ్స్ వైద్యులే అధికం...
రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న నివేదికలో మన జిల్లాకు సంబంధించి ఒంగోలు రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులే అధికంగా ఉన్నట్లు సమాచారం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉంటామని సర్వీసులో చేరేముందు వైద్యులంతా అంగీకరించారు. ఆ మేరకు వారి నుంచి ప్రభుత్వం అంగీకారపత్రం తీసుకుంది. అరుుతే, అందుకు విరుద్ధంగా ప్రభుత్వాస్పత్రుల  పనివేళల్లో కూడా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం ఏడాది క్రితమే నిఘా పెట్టింటి. నివేదిక తయారుచేసి వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అందజేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు వైద్యారోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
 
కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులకు రంగం సిద్ధం...
ప్రభుత్వాస్పత్రుల పనివేళల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న వారందరికీ జిల్లా కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులివ్వడానికి రంగం సిద్ధం చేశారు. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తూనే నర్సింగ్ హోమ్‌లు నిర్వహిస్తున్న వైద్యుల వివరాలను, ప్రభుత్వాస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా ఆరు నెలలకుపైగా సెలవులో ఉన్న వైద్యుల జాబితాను కూడా రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల పరిధిలో పనిచేసే వైద్యుల వరకూ ఈ జాబితా పరిధిలోకి తెచ్చారు.

మంత్రి తీరుపై వైద్యుల విమర్శలు...
ప్రభుత్వాస్పత్రుల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో విఫలమైన మంత్రి కామినేని శ్రీనివాస్.. తన పదవిని కాపాడుకోవడం కోసం హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ వైద్యులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి పనివేళల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేయరాదన్న నిబంధనను తామంతా స్వాగతిస్తున్నామని, కానీ, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతి ఉందని అంటున్నారు. ఇదే విధానం అమలుచేయాలని చూస్తే రిమ్స్‌లో స్పెషలిస్టులెవరూ ఉండే అవకాశం లేదంటున్నారు. రిమ్స్‌లో స్పెషలైజేషన్ చేసిన వారికి ఇస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రైవేటు ప్రాక్టీస్ కూడా లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చదివి వచ్చినవారు తక్కువ జీతానికి పనిచేయరన్న వాదన వినిపిస్తోంది. వైద్యులకు నోటీసులు జారీ అయితే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై అప్పుడే చర్చించుకుంటున్నారు. దీనిపై రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ రాజకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటిదాకా తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని తెలిపారు.
 
ఇప్పటికే ఐదుగురు వైద్యులకు నోటీసులతో ఆందోళన...
ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న ఏరియా ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ఐదుగురు వైద్యులకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో ఒకరు గుంటూరుకు బదిలీపై వెళ్లిపోవడంతో మిగిలిన నలుగురికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో పనిచేస్తున్న వారికి కూడా నోటీసులు వస్తాయన్న ప్రచారం సాగుతోంది. రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులంతా ఏదోక ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండటం, లేకుంటే సొంతంగా నర్సింగ్‌హోం నిర్వహిస్తుండటమే అందుకు కారణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement