'తాగి, సోయితప్పి కాల్చుకున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు'
♦ ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై తీవ్ర వ్యాఖ్యలు
♦ కనీస ఆధారాలను పరిశీలించని ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డి
♦ తాగి, సోయితప్పి కాల్చుకున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు
♦ మరణ వాంగ్మూలం కూడా తాగుబోతు రాతేనన్న విచారణాధికారి
♦ ఏఎస్పీ తీరుపై పోలీసు వర్గాల్లోనే విస్మయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పైఅధికారుల అవినీతి, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఉదంతంపై విచారణ పక్కదారి పడుతోంది. ఆ విచారణ ఎలా జరగబోతోందనే దానిపై విచారణ అధికారి ప్రతాప్‌రెడ్డి అప్పుడే ‘స్పష్టత’ ఇచ్చారు. విచారణ బాధ్యతలు చేపట్టి 12 గంటలు గడవక ముందే.. కనీసం ప్రాథమిక సమాచార సేకరణ కూడా లేకుండానే... రామకృష్ణారెడ్డి ఆత్మహత్య అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామకృష్ణారెడ్డి తాగి, సోరుుతప్పి కాల్చుకున్నాడని.. తెలుగు భాష కూడా సరిగా రాయలేక పోయాడని.. మరణ వాంగ్మూలం కూడా తాగుబోతు రాతలేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కనీసం వైద్యుల ధ్రువీకరణ తీసుకోకుండానే ప్రతాప్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
కనీస పరిశీలన కూడా లేకుండానే..
ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డికి విచారణ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్‌రెడ్డి.. గురువారం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత సిద్దిపేట డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. రామకృష్ణారెడ్డి సూసైడ్‌నోట్‌లో పేర్లు రాసిన పోలీసులను పిలిచి, వారి నుంచి ప్రాథమిక వివరాలను తీసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మరణ వాంగ్మూలం అంటే ఆత్మ ప్రభోదమని న్యాయస్థానాలు కూడా భావిస్తాయి. కానీ విచారణ అధికారి ప్రతాప్‌రెడ్డి మాత్రం సూసైడ్ నోట్ మీద కనీస ప్రాథమిక పరిశీలన, పరిశోధన లేకుండానే తాగుబోతు రాతలుగా అభివర్ణించారు.
తాగి విచక్షణ కోల్పోయాడు కాబట్టి పోతూ పోతూ అధికారుల మీద రాసిపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రామకృష్ణారెడ్డి మద్యం తాగి ఉన్నాడా, లేదా అన్న అంశాన్ని వైద్య నివేదికలు మాత్రమే తేల్చాలి. రామకృష్ణారెడ్డి మృతదేహానికి గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి వైద్యుడు బాలకృష్ణ పోస్టుమార్టం చేశారు. ఆయన నివేదిక ఇవ్వలేదు. కనీసం డాక్టర్ నుండి షార్ట్ రిపోర్టును విచారణాధికారి తీసుకోలేదు. ఇవేమీ లేకుండానే రామకృష్ణారెడ్డి తాగి, విచక్షణ కోల్పోరుు కాల్చుకున్నారని చెప్పడాన్ని బట్టి విచారణాధికారి ఆంతర్యమేమిటో స్పష్టమవుతోందని కొందరు పోలీసులే పేర్కొంటున్నారు.
ఆత్మ సంఘర్షణనూ తప్పుబట్టిన అధికారి
ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఎస్సై రామకృష్ణారెడ్డి చావుకు బతుకుకు మధ్య మూడున్నర గంటల పాటు అంతర్మథనం చెందారు. తనకు ఆప్తులు అనుకున్న వారితో మాట్లాడారు. అధికారులు తనను వేధిస్తున్న తీరును వివరించారు. ఆదుకోవాలని అర్థించారు. తనపై పోలీసు అధికారి, ఇతర పోలీసులతో కూడా మాట్లాడారు. భార్యకు ఫోన్ చేసి ‘నేను పోతున్నా.. పిల్లలు జాగ్రత్త’ అని చెప్పారు. తీవ్రంగా ఆత్మ సంఘర్షణకు లోనయ్యారు. ఇలా లోనైన వారిలో కాళ్లు, చేతులు వణకడం.. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం, సరిగా రాయలేకపోవడం వంటివి జరుగుతాయని... రామకృష్ణారెడ్డి సూసైడ్ నోట్ కూడా అలాంటి సంఘర్షణ మధ్య రాసినదేనని మానసిక నిపుణులు అంటున్నారు. విచారణాధికారి మాత్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఈ అంశంపై శుక్రవారం మాట మార్చిన విచారణాధికారి ప్రతాప్‌రెడ్డి తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ఎస్సై ఆత్మహత్య ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ
హైదరాబాద్: ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లా కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్చా ర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదికను ఈ నెల 30లోగా తమకు అందివ్వాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రతాప్‌రెడ్డిని తప్పించాలి
ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసు విచారణ బాధ్యతల నుంచి ప్రతాప్‌రెడ్డిని తప్పించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. విచారణ అధికారి ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసి ప్రకటన చేశారని.. వ్యతిరేక సాక్షులు రావద్దనేలా సంకేతాన్ని పంపారని విమర్శించారు. అలాంటి అధికారితో న్యాయం జరగదని.. ఈ ఘటనపై సీబీసీఐడీ అధికారులతో విచారణ జరపాలని కోరారు.