విజృంభించిన అతిసారం | atisaram | Sakshi
Sakshi News home page

విజృంభించిన అతిసారం

Published Fri, Aug 5 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

విజృంభించిన అతిసారం

విజృంభించిన అతిసారం

  • ఆనూరులో 15 మంది బాధితులు
  • అప్రమత్తమైన వైద్య యంత్రాంగం
  • పెద్దాపురం ఏరియా ఆస్పత్రిలో రోగులకు చికిత్స
  • కలుషిత జలాలే కారణమంటున్న వైనం
  • అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సీజనల్‌ వ్యాధులొస్తున్నాయని, పంచాయతీల్లో మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయించాలని వైద్యులు పదేపదే చెబుతున్నా, అధికారులు పెడచెవిన పెట్టడంతో.. పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో అతిసారం జడలు విప్పింది. ఈ గ్రామంలో సుమారు 15 మంది అతిసార వ్యాధి బారినపడడంతో వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది.
    – ఆనూరు (పెద్దాపురం)
    గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామానికి చెందిన 12 మంది ఇటీవల అతిసారం బారిన పడ్డారు. తాజాగా మెట్ట గ్రామమైన ఆనూరులో సుమారు 15 మంది అతిసార వ్యాధికి గురై, పెద్దాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గండేపల్లి మండలానికి చెందిన బాధితులు కూడా ఇదే ఆస్పత్రిలో ఉన్నారు. ఆనూరు గ్రామానికి చెందిన నూకతట్టు శ్యామల, వల్లూరి అబ్బులు, పైడిమళ్ల గణేష్, పైడిమళ్ల చిన్నారావు, పైడిమళ్ల ముసలయ్య, కనిపే ఆంజనేయులు, పైడిమళ్ల అప్పాయ్యమ్మ, నూకతట్టు మంగ, కనిపే ఆంజనేయలక్ష్మి తదితరులు బాధితుల్లో ఉన్నారు. అలాగే నాయకంపల్లి గ్రామానికి చెందిన పల్లిపాటి రమ్య, గందం సత్యనారాయణ, మ్యురాల అప్పారావు, సప్పా వీరబాబు, గండేపల్లికి చెందిన దారా తలుపులమ్మ, వరలహాలయ్యపేటకు చెందిన పెద్దింటి వినోద్, మర్రిపూడికి చెందిన అడ్డల తాతారావు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్యాధికారులు ఆనూరు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు ఆస్పత్రికి చేరుకుని, రోగులను పరామర్శించారు. రోగులకు సకాలం వైద్య సేవలందించాలని,, సంఘటనకు కారణమైన మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చాలని అధికారులనుlకోరారు. కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లా టీబీ కంట్రోల్‌ ఆఫీసర్‌ ప్రసన్నకుమార్‌ ఆస్పత్రిలో రోగుల పరిస్థితిపై ఆరా తీశారు. వారికి అవసరమైన మందులను అందుబాటులోకి ఉంచాలని, వైద్య సేవలను మెరుగుపర్చాలని వైద్యులను ఆదేశించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు కూడా రోగులను పరామర్శించారు.
    కాచిన నీటిని మాత్రమే తాగాలి
    వాతావరణ మార్పుల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆస్పత్రిలో అతిసారం కేసులు అధికంగా ఉన్నాయని, ప్రజలంతా కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని చెప్పారు.
     
    వైద్యులపై అధికార పార్టీ నేతల ఒత్తిడి!
    సంఘటనకు కలుషిత జలాలు కారణం కాదని, కలుషితాహారం వల్లే ఇలా జరిగిందని చెప్పండంటూ కొందరు వైద్యులపై పలువురు అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. కలుషిత తాగునీటి వల్లే తాము అస్వస్థతకు గురయ్యామని రోగులు స్పష్టం చేయడం, వైద్యుల విచారణలో కూడా ఇదే విషయం వెలుగు చూడడంతో వారి పాచిక పారలేదు. ఆనూరు గ్రామం రంగంపేట పీహెచ్‌సీ పరిధిలోది కావడంతో అక్కడి వైద్యురాలు శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్లిష్టమైన కేసులను పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఓ దళితపేటలో వాటర్‌ ట్యాంక్‌ను పరిశుభ్రం చేయకపోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement