ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు
కర్నూలు జిల్లాలో ఘటన
గోనెగండ్ల: గతంలో ఏటీఎంలలో నగదు చోరీలు చాలానే జరిగాయి. అయితే కర్నూలు జిల్లా గోనెగండ్లలో శుక్రవారం అర్ధరాత్రి ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. గ్రామం లో ఇండియా1 ఏటీఎం మిషన్‌ను దుండగులు తస్కరించారు. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఏటీఎం సెంటర్‌ను శుభ్రపరిచేందుకు వెళ్లిన మహబుబ్‌బీ ఈ విషయాన్ని గమనించి పోలీసులకు, ఏటీఎం నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ దేవేంద్రకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి డాగ్, క్లూస్ టీంను రప్పించారు. అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు మొదట ఏటీఏం సెంటర్ బయట వున్న సీసీ కెమెరా వైర్‌ను కత్తిరించి ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారు.
డాగ్ స్క్వాడ్ ఏటీఎం సెంటర్ నుంచి పక్కనే ఉన్న షాపు యజమాని ఇంటి వద్ద కెళ్లి అక్కడి నుంచి చాంద్ సినిమా థియేటర్ సమీపంలోని వైన్‌షాపు వద్దకు వెళ్లి మళ్లీ ఏటీఎం సెంటర్ వద్దకే వచ్చి నిలిచిపోయింది. ఏటీఎం మిషన్‌లో రూ. 40 వేలు నగదు మాత్రమే ఉన్నట్లు ఏజెంట్ జగదీష్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఏటీఎం మిషన్ అపహరించారని పోలీసులు, ఇండియా 1 ఏటీఎం నిర్వాహకులకు ఉద యం సమాచారం అందిస్తే వారు మాత్రం మధ్యాహ్నం తాపీగా వచ్చారు. ఏటీఎం నిర్వాహకులు సంస్థలో పనిచేసే ఓ ఏజెంట్‌ను పంపి ఫిర్యాదు ఇప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.