ఖాళీ !
-
విజయవాడ, గుంటూరు నగరాల్లో 3 ఏటీఎంలలోనే నగదు
-
మిగిలిన ప్రాంతాల్లో ‘నో క్యాష్’ బోర్డులే
-
ఆదివారం సరదాలు, సంతోషాలకు బ్రేక్
-
33 రోజులైనా ప్రజలను వీడని కరెన్సీ కష్టాలు
-
నేడు కూడా బ్యాంకులకు సెలవు..
-
ఆందోళనలో జనం
సాక్షి, అమరావతి బ్యూరో : ‘నోట్ల రద్దు ఆషామాషీ నిర్ణయం కాదు. అనేక ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు మరింత పెరుగుతాయి. కానీ 50 రోజుల్లో నోట్ల కష్టాలు సర్దుకుంటాయి. కళ్లముందే పరిస్థితి మెరుగుపడుతుంది..’ అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం రోజురోజుకూ నోట్ల కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. సెలవు అయినా ఆదివారం చేతిలో డబ్బులు లేక ప్రజలు అల్లాడిపోయారు. రెండు జిల్లాల్లో 1,778 ఏటీఎం కేంద్రాలు ఉండగా, పది కూడా పనిచేయడం లేదు. విజయవాడ, గుంటూరు నగరాల్లో కేవలం మూడు ఏటీఎం కేంద్రాలు మాత్రమే పనిచేశాయి. దీంతో డబ్బులు లేక జాలీగా గడపాల్సిన ఆదివారం అందరూ ఖాళీగా ఉండాల్సి వచ్చింది.
33 రోజులు గడిచినా...
రూ.500, రూ.1,000 నోట్లు రద్దుచేసి 33 రోజులు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు డబ్బు వస్తున్నప్పటికీ లైనులో నిలుచున్నవారిని కొన్ని గంటల్లోనే ‘నో క్యాష్’ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఇప్పుడు వరుస సెలవుల కారణంగా రెండు జిల్లాల్లో బ్యాంకులు మూసివేశారు. ఏటీఎంలలోనూ నగదు నిల్వలు లేవు. సోమవారం కూడా బ్యాంకులకు సెలవు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రెండు నగరాల్లో.. పదుల సంఖ్యలోనే..!
విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆదివారం ఉదయం నుంచే ఏ ప్రాంతంలో ఏటీఎంలు పని చేస్తున్నాయని ప్రజలు ఆరా తీయడం కనిపింది. గుంటూరులో నగరంపాలెంలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖకు చెందిన ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేసింది. దీంతో అక్కడ ప్రజలు బారులుతీరారు. విజయవాడ నగరంలోని బందరు రోడ్డులో కోస్టల్ బ్యాంకు ఏటీఎం, బీఆర్‌టీఎస్ రహదారి సమీపంలోని మధురానగర్‌లో ఒక ఏటీఎం మాత్రమే పనిచేశాయి. అక్కడ భారీ క్యూలైన్ కనిపించింది. మిగిలిన ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చాయి. సాయంత్రం కొన్ని ఏటీఎం కేంద్రాలు పని చేసినా, గంట వ్యవధిలోనే నగదు ఖాళీ అయ్యింది. బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో ఏటీఎంలు పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూఅదే తీరు!
రెండు జిల్లాలోని మిగిలిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని బ్యాంకుల ఏటీఎంలు మూతపడ్డాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 48 ఏటీఎం కేంద్రాలు ఉండగా.. ఆదివారం ఒక్కటీ పనిచేయలేదు. విజయవాడ తూర్పు, పశ్చిమ, గన్నవరం, పెడన, పామర్రు, నూజివీడు, మైలవరం, కైకలూరు, నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.అవనిగడ్డలో ఐదు రోజులుగా ఒక్క ఏటీఎం కూడా పని చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గుడివాడ నియోజకవర్గంలో 51 ఏటీఎంలు ఉండగా, పట్టణంలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎం మాత్రమే పనిచేసింది. తిరువూరు పట్టణంలో రెండు ఏటీఎంలు ఉదయం కొద్దిసేపు పనిచేశాయి. కృష్ణా జిల్లాలో మొత్తం నాలుగు ఏటీఎంలు పనిచేశాయి. గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.