
ఆటోడ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘించొద్దు..
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వప్రసాద్ హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులను
♦ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి
♦ ఇసుక అక్రమ రవాణా చేస్తే చోరీ కేసులు
♦ జిల్లాలో ఎస్పీ విస్తృత పర్యటన
జిల్లాలో శుక్రవారం ఎస్పీ విశ్వప్రసాద్ విస్తృతంగా పర్యటించారు. బోధన్, బాన్సువాడ, మద్నూర్, బిచ్కుంద, నిజాంసాగర్ పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులు, క్రైం రిపోర్టులు పరిశీలించారు. ఆటోడ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘించొద్దని, ఇసుకను అక్రమంగా తరలించొద్దని సూచించారు.
బాన్సువాడ : ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వప్రసాద్ హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో తరలించవద్దని సూచించారు. శుక్రవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే వారిపై చోరీ కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. ఇసుక ప్రభుత్వ ఆస్తి అని, దానిని కొల్లగొట్టడం నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవమని హెచ్చరించారు.
అనుమతి లేకుండా ట్రాక్టర్లు, లారీల్లో రవాణా చేసిన వారిపై 379 ఐపీసీ ప్రచారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా దారులతో పోలీసు అధికారులు కానీ సిబ్బంది మిలాఖాత్ అయితే శాఖాపరమైన చర్య లు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మహారాష్ట్ర ముఠాకు చెందిన దొంగలు దోపిడీలకు పాల్పడేందుకు యత్నిస్తున్నాయని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. సమావేశంలో బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్సై సంపత్ పాల్గొన్నారు.
సరిహద్దుల్లో నేర నియంత్రణకు చర్యలు
బోధన్ రూరల్ : జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎస్పీ పి.విశ్వప్రసాద్ తెలిపారు. జిల్లా సరిహద్దుల్లోని సాలూ ర, సలాబాత్‌పూర్‌లలో పోలీసు చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని పేర్కొన్నారు. బోధన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తూ క్రైం రేటును తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాదాలు ఎక్కువ జరిగే రోడ్లను కేటగిరీల వారీగా బ్లాక్ స్పాట్‌లుగా గుర్తిస్తామన్నారు. హైవేలపై ప్రమాదాల నియంత్రణకు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. త్వరలో కిందిస్ధాయి బదిలీలు చేపడతామన్నారు. ఆయన వెంట సీఐలు వెంకన్న, శ్రీనివాసులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి
నిజాంసాగర్ : జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ విశ్వప్రసాద్ అన్నారు. ఆర్‌అండ్‌బీ, ఆర్టీవో, రెవెన్యూ శాఖల సహకారంతో రోడ్డు ప్రమాదాలను నివారిస్తామన్నారు. మూలమలుపులు, బ్రిడ్జిలు, ప్రధాన చౌరస్తాల వద్ద స్పీడ్‌బ్రేకర్లు, సిగ్నల్స్ ఏర్పాటు కోసం రోడ్లను సర్వే చేస్తున్నామన్నారు. నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసులకు క్వార్టర్స్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎస్పీ తెలిపారు. బోధన్ డివిజన్ పరిధిలోని 2 సర్కిల్ కార్యాలయాలతో పాటు మద్నూర్, రెంజల్ పోలీస్‌స్టేషన్లల్లో క్వార్టర్స్ నిర్మాణానికి నిధులు వచ్చాయని చెప్పారు. ఆయన వెంట బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డి, ఏఎస్సై గాంధీగౌడ్ ఉన్నారు.
మద్నూర్ పోలీస్‌స్టేషన్ తనిఖీ
మద్నూర్ : ఎస్పీ విశ్వప్రతాప్ శుక్రవారం మద్నూర్ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లో క్రైం రిపోర్టును అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ఆరాతీశారు. మండలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఎస్సై కాశీనాథ్‌కు సూచించారు. ఆయన వెంట బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సర్ధార్‌సింగ్ ఉన్నారు.
బిచ్కుంద పోలీస్ స్టేషన్..
బిచ్కుంద : ఎస్పీ విశ్వ ప్రసాద్ శుక్రవారం బిచ్కుంద పొలీస్ స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు, పొలీస్ స్టేషన్, పొలీసుల సమస్యలను సీఐ సర్దార్‌సింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, దొంగతనాలు నివారించడానికి నిత్యం గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.