సాహిత్యంతో చెలిమి అవసరం
కాకినాడ కల్చరల్ :
పుస్తకాలు మంచి స్నేహితులు వంటివని ప్రముఖ సాహితీవేత్త మాకినీడి సూర్యభాస్కర్ అన్నారు. స్థానిక జగన్నాథపురం ఆదిత్య టీచర్ ట్రైనింగ్ అకాడమీలో విశ్వర్షి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రదాన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. వివిధ రూపాల్లో సమాజానికి సాహిత్య సేవలు అందజేసిన ప్రముఖ కవులకు, పలువురు జర్నలిస్టులతోపాటు ప్రముఖ సాహితీవేత్త మాకినీడి సూర్యభాస్కర్, కవులు, రచయతలు కాట్ల దేవదానం రాజు, బి. బాబా, గదుల నాగేశ్వరరావు, పుష్పల సూర్యకుమారి, అడపా రామకృష్ణలను ఘనంగా సత్కరించి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీతలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాహిత్యంతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా పాత్రికేయ వృత్తిలో ఉన్నవారికి మరింత అవసరమన్నారు. జీవితకాలంలో తమ అనుభవాలను పదిలపరుచుకుంటే పుస్తకం రూపంలో అందరికీ దాన్ని అందజేయవచ్చుననని అన్నారు. సాహిత్య వ్యవసాయం చేస్తూ ఫలాలను సమాజానికి అందజేస్తున్న విశ్వర్షి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ర్యాలీ ప్రసాద్ సాహిత్య సేవలను అభినందించారు. కళా జగతి పత్రిక పోలవరం అబ్బూరును సన్మానించారు. విశ్వర్షి సాహిత్య అకాడమీ వ్యవస్థాపకుడు ర్యాలి వెంకట్రావు, సూర్యరాయ విజ్ఞానంద గ్రంథాలయం అధ్యక్షుడు ఎం.భరతుడు, కార్యదర్శి కె.శంకరరావు, రచయిత మధునాపంతుల సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సాహిత్యం నేటి సమాజానికి ఎంత అవసరమో వివరించారు. ప్రపంచ పరిణామాలతోపాటు సాహిత్య పేజీలను అందజేస్తున్న పత్రికలను నిర్వాహకులు అభినందించారు. ఆ పత్రికల తరుపున ఈ చిరు సత్కారమని అన్నారు. ఆదిత్య బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వందన సమర్పణ చేశారు.