కర్నూలులో బ్యాడ్మింటన్ అకాడమీకి కృషి
కర్నూలులో బ్యాడ్మింటన్ అకాడమీకి కృషి
Published Wed, Apr 19 2017 10:54 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
– రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్
– అట్టహాసంగా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు ప్రారంభం
– కర్నూలులో క్రీడాకారుల మోటార్ సైకిల్ ర్యాలీ
కర్నూలు (టౌన్): కర్నూలులో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. బుధవారం.. టీజీ భరత్ ఆంధ్రా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను పురస్కరించుకొని స్థానిక మౌర్య ఇన్ వద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారుల ర్యాలీని టీజీ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మౌర్య ఇన్, రాజ్‌విహార్ సర్కిల్, జిల్లా పరిషత్తు, గాంధీనగర్, విద్యానగర్, కిడ్స్ వరల్డ్, కోట్ల సర్కిల్ మీదుగా ఇండోర్ స్టేడియం వరకు సాగింది. ఇండోర్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనతో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. భారత దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు ఎనలేని ప్రాచుర్యం లభించిందన్నారు. రాష్ట్ర స్థాయిలో లీగ్ పోటీలు నిర్వహించడంతో కర్నూలులో ఈ క్రీడ అభివృద్ధిఖఙ అవకాశం ఏర్పడుతుందన్నారు.
టీజీ భరత్ ఆంధ్రా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ టీజీ భరత్ మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా సౌత్‌జోన్ స్థాయి వరకు ఆడిన తాను ఈ క్రీడ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. క్రికెట్ తరహాలో ఈ క్రీడకు ప్రాచుర్యం తీసుకురావాలని కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని క్రీడలను సమాన అవకాశాలు కల్పించాలన్నారు. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య అధ్యక్షుడు పున్నయ్య చౌదరి మాట్లాడుతూ.. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను నిర్వహించడం కర్నూలుకే గర్వకారణమన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడుతున్న 60 మంది క్రీడాకారులను వేలం ద్వారా కోనుగోలు చేసి లీగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి, ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడలో ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల్లో రాయలసీమ వారియర్స్, వైజాగ్ ఎసర్స్, గోదావరి గన్స్ తదితర టీమ్‌లు తలపడనున్నాయి. గెలుపొందిన వారికి రూ. 10 లక్షలు విలువ చేసే బహుమతులు ఇస్తున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, రవికిరణ్, శ్రీనివాస భట్, వంశీ, రవికళాధర్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement