ఓటర్ల జాబితా సవరణకు సిద్దం కండి
– వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 31 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి అర్హులయిన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భన్వర్‌లాల్ మాట్లాడుతూ బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు ఇంటింటికి వెళ్లి ఓటర్లను గుర్తించాలని, కొత్త ఓటర్లను నమోదు చేసి ఎప్పటికప్పుడు సీఈఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ నెల చివరినాటికి వంద శాతం ఓటర్ల జాబితాను ప్రకటించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మార్పులు, చేర్పులకు కూడా ప్రతిపాదనలు పంపాలన్నారు. కర్నూలు నుంచి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఈ 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 456 పోలింగ్ స్టేషన్‌ల మార్పులు, చేర్పుల కోసం ప్రతిపాదించామన్నారు. ఇప్పటి వరకు పట్టభద్రులు 2250 మంది, ఉపాధ్యాయులు 93 మంది ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, ఈఆర్‌ఓలు పాల్గొన్నారు